మిరపకాయలను ఉచితంగా పంచిన రైతు

31 Mar, 2018 12:35 IST|Sakshi
మిరపకాయలను ఉచితంగా అందిస్తున్న రైతు

కలిగిరి: కష్టపడి సాగు చేసిన పచ్చిమిర్చికి కనీస ధర పలకకపోవడంతో ఆవేదన చెందిన రైతు, వ్యాపారులకు అమ్మడం ఇష్టం లేక శుక్రవారం ప్రజలకు ఉచితంగా పంచిపెట్టాడు. పోలంపాడు గ్రామానికి చెందిన కల్లూరి చంద్రమౌళి ఎకరా పొలంలో పచ్చిమిరప సాగు చేస్తున్నాడు. పచ్చిమిరపకాయలను బస్తా కోసుకొని అమ్మడానికి మోటర్‌బైకుపై కలిగిరికి వచ్చాడు. వ్యాపారులు కిలో రూ. 4కు మిరపకాయలు తీసుకుంటామన్నారు. ఆ ధరకు అమ్మితే కనీసం కోత కూలీలు కూడా రావని రైతు ఆవేదన చెందాడు. వ్యాపారులకు తక్కువ ధరకు పచ్చిమిరపకాయలను ఇవ్వడానికి ఇష్టం లేక పోలిస్‌స్టేషన్‌ సమీపంలోకి వచ్చాడు. అక్కడ ఉన్న ప్రజలకు బస్తాలోని పచ్చిమిరపకాయలను ఉచితంగా అందించాడు.  రైతు చంద్రమౌళి కూరగాయలు పండించే రైతులకు చెల్లించే ధరలకు, మార్కెట్‌లో వ్యాపారులు అమ్మే ధరలకు పొంతన ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు