ప్రసాదంలా..నిధుల పందేరం

7 Sep, 2019 08:04 IST|Sakshi

అడ్డగోలుగా అప్పన్న ఆదాయం దుర్వినియోగం

టీడీపీ హయాంలో అస్తవ్యస్తంగా దేవస్థానం ఆర్థిక నిర్వహణ

అంతర్గత విజిలెన్స్‌ వ్యవస్థ లేకే అక్రమాలు

అయినవారికే మళ్లీ మళ్లీ పనులు, లీజులు

కోర్కెలు తీర్చే అప్పన్నకు భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్న మొక్కులు, విరాళాలు స్వాహార్పణం అయిపోయాయి. బిల్లులు లేకపోయినా.. పనులు జరగకపోయినా చాలా ఉదారంగా ప్రసాదం పంచినట్లు అప్పన్న నిధులను దేవస్థానం అధికారులు పంచిపెట్టేశారు. ఇది ఏ ఒక్క ఏడాదికో పరిమితం కాలేదు. టీడీపీ హయాంలో గత ఐదేళ్లలోనూ ఇదే తంతు సాగింది. నిధుల వ్యయం, బిల్లుల చెల్లింపులు ఎంత దారుణంగా జరిగాయంటే.. ఏకంగా 105 అంశాల్లోనే సరైన లెక్కాపత్రాలు లేకుండా కోట్లకు కోట్లు ఖర్చు చేసేశారు. ఈ మొత్తం సుమారు 29 కోట్లు. ఇది ఎవరో ఊసుపోక చేసిన ఆరోపణ కాదు. స్వయంగా ఆడిట్‌లో తేలిన అంశం. ఆ శాఖే నివేదించిన కఠోర వాస్తవం. మొత్తంగా చూసుకుంటే 375 అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయని ఆ శాఖ నిగ్గు తేల్చింది.  అంతర్గత విజిలెన్స్‌ వ్యవస్థ లేకపోవడం.. బ్లాక్‌లిస్టులో చేర్చాల్సిన కాంట్రాక్టర్లు, షాపుల యజమానులే మళ్లీ మళ్లీ కాంట్రాక్టులు, షాపుల లీజులు పొందుతుండటంతో అడ్డగోలు చెల్లింపులు, ఎగవేతలకు అడ్డుకట్ట పడటం లేదని ఆడిట్‌ నివేదికలో పేర్కొన్నారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలోనే పేరుగాంచిన నారసింహ క్షేత్రాల్లో మొదటి స్థానంలో ఉన్న సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం నిధులు అడ్డగోలుగా దుర్వినియోగమవుతున్నాయి. టీడీపీ అధికారం చెలాయించిన గత ఐదేళ్లలో దేవస్థానం ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇష్టారాజ్యంగా అడ్వాన్స్‌ పేమెంట్లు, బిల్లులు లేకపోయినా నగదు చెల్లింపులు.. ఇలా అడ్డగోలుగా అప్పన్న ఖజానాకు భారీ చిల్లులు పడ్డాయి. ఆడిట్‌ అధికారుల నివేదికతో ఈ అవినీతి పర్వం వెలుగు చూసింది.

రూ.61 కోట్ల చెల్లింపులపై అభ్యంతరం..
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రూ.61 కోట్ల 32 లక్షల 87వేల చెల్లింపులపై ఆడిట్‌ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ చెల్లింపులకు దేవస్థానం సిబ్బంది సమర్పించిన బిల్లులు చూసి ఆడిట్‌ అధికారులు విస్తుపోయినట్టు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 375 అంశాల్లో(కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి) చెల్లింపులు జరిగాయని తేలింది. అంతే కాకుండా కోట్లాది రూపాయలను అవసరానికి మించి అదనంగా చెల్లించేశారని ఆడిట్‌ అధికారులు లెక్కవేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 105 అంశాల్లో కోట్లకు కోట్లు అదనపు చెల్లింపులు జరిగాయి. రూ.2.09 కోట్ల సర్దుబాటు చెల్లింపులకు అసలు బిల్లులే లేవట. రూ. 27.42 కోట్ల చెల్లింపులకు సరైన రికార్డుల్లేవని, ఇంకొన్ని బిల్లులకు సంబంధించి రూ. 29 కోట్ల మేర అదనంగా చెల్లించారని ఆడిట్‌ శాఖ నిగ్గుతేల్చింది.

ఇంజినీరింగ్, పరిపాలన విభాగం తప్పులు 105..
ఇక ఇంజినీరింగ్, పరిపాలన విభాగాల్లో 105 అంశాలకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు, ఆడిట్‌ అనుమతి లేకుండా అభ్యంతరకర అదనపు చెల్లింపులు చేసినట్లు తేలింది. ఇదే విషయమై ఈ ఏడాది మార్చిలో ఆడిట్‌శాఖ అప్పటి ఈవో రామచంద్రమోహన్‌కు ఒక నివేదిక సమర్పించింది. ఇందులో 35 అంశాలకు సంబంధించి తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంది. దేవస్థానం ఉన్నతాధికారిగా రామచంద్రమోహన్‌ ఆ అభ్యంతరాలకు సమాధానాలు ఇవ్వగా.. వాటిలో 13 వివరణలకు మాత్రమే ఆడిట్‌ అధికారులు ఒకింత సంతృప్తి చెందారు. మిగిలిన 22 అంశాల విషయంలో ఇప్పటికీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

బ్లాక్‌లిస్ట్‌లో ఉండాల్సిన బకాయిదారులదే ఇష్టారాజ్యం..
2016–17 ఆడిట్‌ రిపోర్టు ప్రకారం సుమారు రూ.6.75 కోట్ల బకాయిలు ఇంకా కాంట్రాక్టర్లు, షాపుల యజమానుల నుంచి రావాల్సిఉంది. 2019 మార్చి నాటికి ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. బకాయిల వసూలులో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంతో ఉన్నారనడానికి ఇదే నిదర్శనం. బకాయిలు అడగకుండా ఉండడటానికి కాంట్రాక్టర్లు, షాపుల యజమానులు ఎప్పటికప్పుడు సిబ్బందికి చేతులు తడుపుతున్నారనేది బహిరంగ రహస్యం. బ్లాక్‌ లిస్టులో ఉండాల్సిన బకాయిదారులే తిరిగి కాంట్రాక్టులు, వేలం పాటల్లో యథేచ్చగా పాల్గొంటున్నారు. పాత బకాయిలు కట్టకపోయినా అధికారులు వారితో కుమ్మక్కవ్వడం వల్లే దేవస్థానానికి రావాల్సిన కోట్లాది రూపాయలు రాకుండా పోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆదాయం రూ.147కోట్లు... ఖర్చు రూ.144కోట్లు..
2016–17లో దేవస్థానానికి రూ.147.26 కోట్ల ఆదాయం రాగా అందులో రూ.144.50 కోట్లు ఖర్చుగా చూపించారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేవస్థానంలో అంతర్గత విజిలెన్స్‌ టీం ఏర్పాటు చేయాలని ఆడిట్‌ విభాగం ఎప్పటి నుంచో కోరుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఉన్నతాధికారులు ఈ అడ్డగోలు చెల్లింపులు, ఆడిట్‌ అభ్యంతరాలపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. 

మరిన్ని వార్తలు