నేను లేకుండా పంచేస్తారా?

30 Jan, 2016 04:03 IST|Sakshi
నేను లేకుండా పంచేస్తారా?

సాలూరు: ‘నేను మంజూరుచేయించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నేను లేకుండా పంపిణీ చేస్తారా?, అంటూ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తెలుగుదేశం పార్టీ నేతలపై మండిపడ్డారు. సాలూరు  తహశీల్దార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సంధ్యారాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ గొర్లె విజయకుమారి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్ తదితరులు అనారోగ్యంతో ఉన్న వారికి సీఎం రలీఫ్ ఫండ్ చెక్కులు శుక్రవారం  పంపిణీ చేసిన విషయం తెలియడంతో రాజన్నదొర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
అనారోగ్య పీడితులకు కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆర్థిక సాయం మంజూరయ్యేలా తాను కృషి చేస్తే ఇప్పుడు తాను లేకుండా తామేదో మంజూరు చేయించినట్లు అధికార పార్టీ నేతలు చెక్కులు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు.  ఆపదలో ఉన్న వారికి కూడా పైసా మంజూరుచేయని  నియోజకవర్గంలో తాను గత ప్రభుత్వ హయాంలో మంజూరుచేయించిన భవణాలు, వంతెనలు, రోడ్లను ప్రారంభిస్తున్నారే తప్ప వారు మంజూరుచేయించిన ఒక్క అభివృద్ధి పనిని చూపగలరా అని ప్రశ్నించారు.
 
మాజీలను పిలిస్తే ఊరుకునేది లేదు
ఇంతవరకు తాను ప్రోటోకాల్ విషయంలో చూసీచూడనట్టు వ్యవహరించానని, ఇకపై ఊరుకునేది లేదని రాజన్నదొర అధికారులను హెచ్చరించారు. అధికారిక కార్యక్రమాలకు అధికార పార్టీకి చెందిన మాజీ నేతను ఆహ్వానిస్తున్నారని, ఇకపై అలా జరిగితే మర్యాదగా  ఉండదని తేల్చిచెప్పారు.

మరిన్ని వార్తలు