తెలంగాణలో జెండా పీకేసిన టీడీపీ.. కాసాని జ్ఞానేశ్వర్‌ తాడోపేడో..!

29 Oct, 2023 11:44 IST|Sakshi

తెలంగాణలో చేతులెత్తేసిన టీడీపీ

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ.. తెలంగాణలో జెండా పీకేసింది. ఎన్నికల్లో పోటీ చేయలేమంటూ టీడీపీ క్యాడర్‌కు చంద్రబాబు సంకేతాలు ఇచ్చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ సందర్భంగా తెలంగాణలో పోటీ చేయొద్దంటూ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు మేలు చేయడం కోసమే తెలంగాణలో పోటీకి దూరమంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందం మేరకే పోటీకి దూరం అంటూ చర్చ సాగుతోంది.

ఇప్పటివరకు హైదరాబాద్ తానే అభివృద్ధి చేశానంటూ చెప్పుకున్న చంద్రబాబు.. తెలంగాణ, హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే ఎందుకు పోటీ చేయడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా, టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ తెలంగాణ చీఫ్‌ కాసాని జ్ఞానేశ్వర్.. నేడు నారా లోకేశ్‌తో కాసాని జ్ఞానేశ్వర్ భేటీ కానున్నారు. ఇన్నాళ్లు పార్టీ పోటీ చేస్తుందంటూ మభ్య పెట్టారన్న ఆవేదనలో ఉన్న జ్ఞానేశ్వర్‌ నారా లోకేష్‌తో తాడోపేడో తేల్చుకోనున్నట్లు సమాచారం.

తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత మారిన పార్టీ స్టాండ్‌తో తల పట్టుకుంటున్న కాసాని జ్ఞానేశ్వర్‌..  పార్టీ కోసం బోలెడు ఖర్చు పెట్టాం అంటూ టీడీపీ పెద్దల దగ్గర వాపోయినట్లు తెలిసింది. తెలంగాణలో ఒంటరి పోరు వల్ల కాదని.. పోటీకి దూరంగా ఉండాలని నారా లోకేష్‌ సూచించడంతో, పోటీ చేయొద్దని ఇప్పుడు నిర్ణయిస్తే తన పరిస్థితి ఏంటని, ఇన్నాళ్లు తాను పడ్డ శ్రమ పెట్టిన ఖర్చు ఫలితం ఏంటని కాసాని ప్రశ్నిస్తున్నారు.. ఏపీ రాజకీయాలకు తెలంగాణను ముడి పెట్టడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తే కనీసం పార్టీకి మనుగడ అయినా ఉంటుందని అంటున్న కాసాని.. ఇంకా కూడా పార్టీ పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకోకపోతే తన దారి తాను చూసుకుంటానని కాసాని తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను కాసాని అన్వేషిస్తున్నట్లు సమాచారం.
చదవండి: పవన్‌ కల్యాణ్‌ రాయబారం సఫలం కాలేదా?!

మరిన్ని వార్తలు