కాసులే కాసులు

23 Feb, 2015 03:32 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  ఆస్తి పన్నుల వసూళ్లపై  కొన్ని రోజులుగా నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మొండి బకాయిలు ఉన్న భవనాలు, అపార్ట్‌మెంట్‌లు, వ్యాపార సముదాయాలు ఎదుట రెవెన్యూ సిబ్బంది నిరసనలు తెలుపుతూ వసూళ్లకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే రాజకీయనేతలు, అధికారుల ప్రాపకం లేని వారిని ఎంచుకుని ఇటువంటి చర్యలకు దిగడంపై కొందరు న్యాయనిపుణులు కార్పొరేషన్ అధికారుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారు.
 
  కలెక్టర్ కార్యాలయం నుంచి ఆ ప్రాంగణంలోని ఇతర కార్యాలయాలు, నగరంలోని బడా విద్యా సంస్థలు, పేరొందిన హోటళ్లు, సినిమాహాళ్లు, వ్యాపార సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు, కల్యాణ మండపాలు, ఇన్సూరెన్స్ కార్యాలయాలు, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయాలతో సహా నగరంలోని పోలీస్‌స్టేషన్ల ఆస్తుల పన్నుల వసూళ్లను విస్మరించడం గమనార్హం. నెల్లూరు నగర పాలక సంస్థకు రూ.31.50 కోట్లు ఆస్తి పన్నుల రూపంలో వసూలు కావాల్సి ఉంది. అందులో సుమారు రూ.9 కోట్లు ప్రభుత్వ కార్యాలయాల నుంచి బకాయిలున్నాయి. పేరుకుపోయిన పన్నుల బకాయిల జాబితాలో ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన కార్యాలయాల్లో ప్రథమస్థానం కలెక్టర్ కార్యాలయానిదే.
 
 బకాయిలు, జరిమానా, ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన పన్నుతో కలిపి రూ.44,64,278 చెల్లించాల్సి ఉంది. మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించే గోల్డెన్‌జూబ్లీహాల్ నుంచి వారి విశ్రాంతి కోసం నిర్మించిన అతిథి గృహాల పన్నులు చెల్లించడం కూడా మానేశారు. నగరంలో సర్వహంగులతో నిర్మించిన పినాకినీ ప్రభుత్వ అతిథి గృహ బకాయిలు రూ.35,68,976 ఉండడం విశేషం. ఫ్లాట్‌ఫాం మీదకు అడుగు పెట్టాలంటేనే డబ్బులు వసూలు చేసే రైల్వే శాఖ నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్ ఆస్తి పన్నుల చెల్లింపునకు మాత్రం ఏళ్ల తరబడి ఎగనామం పెట్టింది.
 
 రైల్వేస్టేషన్‌కు సంబంధించి రూ.30,63,930 ఆస్తి పన్ను కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉంది. జిల్లా పోలీస్ సూపరింటెండంట్ కార్యాలయానికి సంబంధించి రూ.9,66,745 పన్ను చెల్లించాల్సి ఉంది. ఆర్టీసీ, న్యాయస్థానాల భవనాలకు కూడా మినహాయింపులేదు. నిధులు పుష్కలంగా కలిగిన టీటీడీ కల్యాణ మండపానికి సంబంధించి రూ.7,16,054 బకాయిలు ఉన్నాయి. టెలికాం శాఖ నిర్వహణలోని తిక్కన టెలిఫోన్ భవన్ ఆస్తి పన్ను రూ.11,37,474, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయానికి సంబంధించి రూ.11,90,382 బకాయిలున్నాయి. ప్రధాన తపాలా కార్యాలయం, అనుబంధ కార్యాలయాలు బకాయిలు కూడా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి.
 
 వీరంటే భయమా..
 నగరంలోని భారీ కల్యాణ మండపాలు, సినిమాహాళ్లు, ట్రస్టులు, దేవాలయాల ఆస్తి పన్నులు బకాయిలు సైతం కోట్ల రూపాయల్లో ఉన్నాయి. ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వారి రెండు సినిమా థియేటర్ల ఆస్తి పన్నులు బకాయిలు రూ.లక్షల్లో ఉన్నాయి. కార్పొరేషన్ రెవెన్యూ సిబ్బంది సైతం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆర్‌ఆర్ స్ట్రీట్‌లో ప్రముఖ రాజకీయ కుటుంబం నిర్వహణలోని ఓ కాంప్లెక్స్‌కు సంబంధించి సుమారు రూ.10 లక్షలు బకాయిలు ఉన్నాయి. దశాబ్ద కాలంగా కార్పొరేషన్‌ను ఏలిన కుటుంబం పన్నుల చెల్లించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.
 
 కొంత కాలంగా మూతపడిన ఏబీఎం, సీఏఎం పాఠశాలల ఆస్తులు, అమెరికన్ ఆసుపత్రికి సంబంధించిన ఆస్తి పన్నులు కూడా లక్షల రూపాయల్లో బకాయిలు ఉన్నాయి. సేవ పేరుతో ఏర్పాటు చేసిన కొన్ని ట్రస్టుల నిర్వహణ కార్యాలయాలు సైతం పన్నులు చెల్లించడం లేదు. భారీగా బ్యాంకు జమలు ఉన్న రెవెన్యూ అసోసియేషన్ ఎన్‌జీఓ అసోసియేషన్లు కూడా తమ భవనాలకు పన్ను చెల్లించడంలేదు. దర్గామిట్టలోని ఎన్‌జీఓ హోమ్ ఆస్తి పన్ను బకాయిలు రూ.17,53,178 ఉండడం గమనార్హం.
 
 రాజకీయ పార్టీలదీ అదే దారి
 పలు రాజకీయ పార్టీలు తమ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తి పన్నులు చెల్లించడం లేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన ఇందిరా భవన్‌కు సంబంధించి రూ.1,51,002 బకాయిలున్నాయి. భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయానికి సంబంధించి రూ.5,59,407 ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా అధికార పార్టీకి చెందిన జిల్లా  తెలుగుదేశం పార్టీ కార్యాలయం పన్ను బకాయిలు ఉన్నప్పటికీ వాటిని వెల్లడించడంలో అధికారులు గోప్యత పాటిస్తున్నారు. పన్నులు వసూళ్లకు కార్పొరేషన్ సిబ్బంది చేపట్టిన వినూత్న కార్యక్రమాలు అభినందించతగినవే. అయినప్పటికీ కోట్ల రూపాయల్లో బకాయిలు ఉన్న ప్రారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి వసూలు చేయాల్సి ఉందన్న సత్యాన్ని కూడా గ్రహిస్తే మంచిదని పలువురు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు