కాసులిస్తేనే కు.ని.

5 Nov, 2018 13:12 IST|Sakshi
కోవెలకుంట్ల సీహెచ్‌సీలో ఆపరేషన్‌ థియేటర్‌

రోగుల నుంచి రూ. 2500 డిమాండ్‌

డబ్బులివ్వకుంటే ఏదో సాకుతో ఆపరేషన్లు వాయిదా

వారం వ్యవధిలో ఇరువురికి ఆపరేషన్లు నిరాకరణ

ఇబ్బందులు పడుతున్న సామాన్యులు

కర్నూలు  , కోవెలకుంట్ల: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాల్సి ఉండగా కోవెలకుంట్ల సీహెచ్‌సీలో కాసులిస్తే తప్ప చేయడం లేదు. వైద్య పరికరాల కొనుగోలు పేరుతో కొందరు ఉన్నత స్థాయి సిబ్బందే డబ్బు డిమాండ్‌ చేస్తున్నారని, డబ్బు ఇవ్వకపోతే ఆపరేషన్‌ చేయకుండా వెనక్కి పంపుతున్నారని బాధితులు వాపోతున్నారు.  

నాలుగు మండలాలకు వైద్య సేవలు..
కోవెలకుంట్ల, సంజామల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల ప్రజలకు వైద్య సేవలతోపాటు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు  చేసేందుకు  వీలుగా  పట్టణంలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటైంది. ఆయా మండలాల్లోని బాలింతలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు ఆపరేషన్‌ థియేటర్‌ సౌకర్యం కూడా కల్పించారు. గతంలో సీహెచ్‌సీలో డాక్టర్‌ నాగరాజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించేవారు. 2015వ సంవత్సరంలో ఆయన ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లిపోవడంతో అప్పటి నుంచి ఆపరేషన్‌ థియేటర్‌ మూత పడింది. దీంతో ఆయా మండలాల బాలింతలు నంద్యాల, ఆళ్లగడ్డ, కర్నూలు, బనగానపల్లె పట్టణాలకు వెళ్లి  ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చేది. ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీ నుంచి ఆసుపత్రిలో  కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను పునరుద్ధరించారు. రెండు నెలల కాలంలో 45 మందికి  ఆపరేషన్లు చేశారు.  

డబ్బివ్వకుంటే వెనక్కి..
పట్టణంలోని సీహెచ్‌సీలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది కు.ని. ఆపరేషన్లకు  డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. రూ. 2500 ఇవ్వాలని, లేని పక్షంలో అంతే  విలువ చేసే బీపీ మిషన్, ఇతర వైద్య పరికరాలు కొనుగోలు చేసి తీసుకురావాలని చెబుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఇవేవీ ఇవ్వని పక్షంలో ఏదో సాకుతో ఆపరేషన్లు చేయకుండా వెనక్కి పంపుతున్నారని వాపోతున్నారు. నిరు పేద కుటుంబాలు అంత మొత్తం ఇచ్చుకోలేక ఆపరేషన్లు చేయించుకోకుండా వెనుదిరిగి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఆపరేషన్ల వ్యహరంపై విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

ఆపరేషన్‌ చేయకుండా పంపారు
మూడో సంతానంగా కుమారుడు జన్మించడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించేందుకు స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆపరేషన్‌కు ముందు బీపీ, రక్తపరీక్ష, మూత్ర పరీక్ష, తదితర పరీక్షలు చేసి.. మత్తు ఇంజక్షన్‌ కూడా వేశారు. కొన్ని నిమిషాల్లో ఆపరేషన్‌ చేయాల్సి ఉండగా ప్రస్తుతం ఆపరేషన్‌ చేసే ఉద్దేశం లేదని, కర్నూలు వెళ్లి చేయించుకోవాలని వెనక్కు పంపారు.  ఇంజక్షన్‌ చేసి వదిలేయడంతో వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను.               – లక్ష్మీదేవి, కోవెలకుంట్ల

బీపీ మిషన్‌ తీసుకొస్తేనే ఆపరేషన్‌ చేస్తామన్నారు
కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కోసం నా కుమార్తె షాహినాను కోవెలకుంట్లలోని ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఆపరేషన్‌ చేసేందుకు అన్ని పరీక్షలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆపరేషన్‌ చేయాల్సి ఉండగా బీపీ మిషన్‌ కొనుగోలు చేసి తీసుకురమన్నారు.  తన వద్ద అంత డబ్బులేదని చెప్పాను. అయితే రూ. 2500 ఇవ్వమని అడిగారు. అంత ఇచ్చే స్తోమత లేదన్నాను. అయితే వారం రోజుల తర్వాత రమ్మని   పంపించేశారు.  దీంతో బనగానపల్లె ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్‌ చేయించాను.– మహబూబ్‌బీ, సౌదరదిన్నె, కోవెలకుంట్ల మండలం

విచారణ జరిపిస్తాం
కోవెలకుంట్ల సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు డబ్బు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఈ సంఘటనలపై విచారణ జరిపిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లకు ప్రజలు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్లు, మందులు, తదితర సదుపాయాలు ఉచితంగా కల్పిస్తాం.– రామకృష్ణరావు, డీసీహెచ్, నంద్యాల

మరిన్ని వార్తలు