గౌరవమైన వృత్తికి కళంకం తేకండి

12 Aug, 2015 02:51 IST|Sakshi
గౌరవమైన వృత్తికి కళంకం తేకండి

ఉన్నవారే పనిచేయకపోతే.. కొత్త వారెందుకు?
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని
 
 నెల్లూరు(అగ్రికల్చర్) :  వైద్య వృత్తి చాలా గౌరవ ప్రదమైంది.. మీ ప్రవర్తనతో ఆ వృత్తికి కళంకం రాకుండా చూడాలని ప్రభుత్వ వైద్యులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు సూచించారు. నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ వైద్యులతో ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉన్న వారే సక్రమంగా పని చేయకపోతే.. కొత్తవారిని ఎందుకు మీరే చెప్పాలన్నారు. వైద్యులు రోజువారి విధుల్లో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లతో వైద్యశాలను కార్పొరేటుకు దీటుగా తీర్చిదిద్దుతుందన్నారు.

ప్రొఫెసర్లు సకాలంలో క్లాసులకు హాజరు కాకపోతే వైద్య విద్యార్థుల భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు. శాశ్వత ప్రిన్సిపల్‌ను నియమిస్తామన్నారు. 20 శాతం సిబ్బంది కూడా విధులకు హాజరు కాకపోతే ఆసుపత్రిని ఎలా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ వైద్యశాల మరమ్మతులకు రూ.65 లక్షలు కేటాయించామన్నారు. ఇప్పటికి తాను మూడుసార్లు ఆసుపత్రిని పరిశీలించానని, ఎన్నిసార్లు హెచ్చరించినా సిబ్బంది పనితీరు మారకపోవడం బాధాకరమన్నారు. లీవు పెట్టకుండా విధులకు గైర్హాజరుకావడం దురదృష్టకరన్నారు.

పూర్తిస్థాయిలో విచారించి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యశాల అభివృద్ధికి త్వరలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,412 వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో సక్రమంగా వైద్యసేవలు అందటం లేదని ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. డిపార్ట్‌మెంట్ హెడ్స్ విధులు సక్రమంగా రాకపోతే కింద స్థాయి సిబ్బంది సక్రమంగా ఎలా పని చేస్తారని ప్రశ్నించారు.

ఇప్పటికైనా డాక్టర్లు తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విధులను విస్మరించేవారిని ఉపేక్షించే సమస్యే లేదని హెచ్చరించారు. బీజేపీ నేత సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి వైద్యశాల పనితీరు బాగలేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. వసతులు మెరుగు పరచాలని విన్నవించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ భారతిరెడ్డి, వైద్యశాల ఆర్‌ఎంఓలు రంగారావు, విజయగౌరి, వైద్యశాల ప్రొఫెసర్లు, వైద్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు