ట్రెక్కింగ్ కోసం వెళ్లి... | Sakshi
Sakshi News home page

ట్రెక్కింగ్ కోసం వెళ్లి...

Published Wed, Aug 12 2015 2:51 AM

2014లో చిక్‌మగళూరు అటవీప్రాంతంలో వివేక్, శశిధర్ (ఫైల్ ఫోటో) - Sakshi

- చిక్‌మగళూరు అడవిలో దారి తప్పిన హైదరాబాదీలు
- రెండు రోజులుగా ప్రత్యేక బృందాల గాలింపు
- అచేతన స్థితిలో ఉన్న ఇద్దరిని రక్షించిన పోలీసులు
 
సాక్షి,హైదరాబాద్, బెంగళూరు:
ట్రెక్కింగ్ కోసం హైదరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరుకు వెళ్లిన గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ సభ్యులు ఇద్దరు అక్కడి అటవీ ప్రాంతంలో ఆదివారం దారి తప్పి పోయారు. రెండు రోజులుగా తిండి,నిద్ర లేక సొమ్మసిల్లి పడిపోయిన వారిని మంగళవారం రాత్రి ఎత్తై కొండ ప్రాంతంలో ప్రత్యేక బృందాలు గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.  

హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్‌కు చెందిన 11 మంది సభ్యుల బృందం శుక్రవారం చిక్‌మగళూరు అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయడానికి వెళ్లింది. ఈ బృందంలో గచ్చీబౌలి ఐఐఐటీలో పనిచేసే వివేక్ గుప్తా, సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శశిధర్‌లు ఉన్నారు. వీరంతా ట్రెక్కింగ్ అనంతరం ఆదివారం సాయంత్రం ఒక చోట కలసి అక్కడి నుండి హైదరాబాద్ తిరుగు ప్రయాణం కావాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగానే అందరూ ఒక చోటకే వచ్చారు. కానీ, ఇంతలోనే మళ్లీ ఇప్పుడే వస్తామంటూ వివేక్, శశిధర్‌లు తమ కిట్ బ్యాగ్‌లు, సెల్‌ఫోన్‌లు అక్కడే వదిలేసి అడవిలోకి వెళ్లారు. రాత్రి వరకు వేచిచూసినా వారిద్దరు రాకపోవడంతో బృందం సభ్యులు సోమవారం ఉదయం స్థానిక పోలీసులకు,అడ్వెంచర్ క్లబ్ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసు, అటవీ శాఖ ప్రత్యేక బృందాలు రెండు రోజులు అడవిని జల్లెడ పట్టాయి. చివరకు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఓ జలపాతం వద్ద అచేతన స్థితిలో ఉన్న వివేక్, శశిధర్‌లను గుర్తించి, వారు క్షేమ సమాచారాన్ని  హైదరాబాద్‌లోని వారి బంధువులకు తెలియజేశాయి.  బుధవారం ఉదయం వారిని సురక్షితంగా తీసుకువచ్చే ఏర్పాట్లు చేశామని అడ్వెంచర్ క్లబ్ ప్రతినిధి సురేశ్  ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement