రైతన్నకు ‘రుణ’ గండం

21 May, 2016 08:54 IST|Sakshi

ధాన్యం నగదు బ్యాంకుఖాతాల్లో వేస్తున్న ప్రభుత్వం
సగానికిపైగా రైతులకు బ్యాంకుల్లో అప్పులు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం విక్రయించిన అన్నదాతలను బ్యాంకుల్లో రుణ గండం భయపెడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సగానికిపైగా రైతులు బ్యాంకుల్లో అప్పులున్నారు. ఈవిధంగా అప్పులున్న వారి ఖాతాలోకి నగదు పడితే బ్యాంకర్లు పాత అప్పుల కింద జమవేసుకుంటారనే భయం పట్టుకుంది. ఇప్పుటికే డ్వాక్రా లోన్ల నగదును, గ్యాస్ సబ్సిడీ నగదుని పాత బకాయిల కింద కలిపేసిన సందర్భాలు ఉండడంతో రైతులు దిక్కుతోచని స్థితికి చేరుకుంటున్నారు.


పలమనేరు రూరల్:రైతుల నుంచి ప్రభుత్వం సేకరిస్తున్న ధాన్యానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ధాన్యాన్ని విక్రయించిన రైతులు నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులేమో రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తున్నారు. తీరా బ్యాంకులు తమ డబ్బును ఎక్కడ పాత అప్పులకు జమ చేసుకుంటాయోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రభుత్వ ధాన్య విక్రయ కేంద్రాల్లో పరిస్థితి.

 
ఉదాహరణకు పలమనేరు నియోజకవర్గంలో ఐదుచోట్ల ప్రభుత్వం ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. పల మనేరు, పెద్దపంజాణి, వి.కోటలో వెలుగు ద్వారా, గంగవరం, పెద్దపంజాణిలలో పీఏసీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. బ్యాంకుల ద్వారా నగదు పొందాల నే ప్రభుత్వ నిబంధనలతో ధాన్యం విక్రయాలు మందకొడిగానే సాగుతున్నాయి. ఇప్పటిదాకా పలమనేరు నియోజకవర్గంలోని అన్ని కేంద్రాల్లో మొత్తం 3,500 క్వింటాళ్ల  ధాన్యాన్ని మాత్రమే రైతులు విక్రయించారు.

 
బ్యాంకులతోనే భయం

చంద్రబాబు రుణమాఫీ హామీతో చాలామంది రైతు లు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేదు.  సగం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగనేలేదు. దీంతో బకాయిపడ్డ రైతులు కొందరు రీషెడ్యూల్ చేసుకోగా మరికొందరు డీఫాల్టర్లుగా మారారు. దీంతో బ్యాంకర్లు ఎలాగైనా ఈ రైతుల నుంచి ఈ బకాయిలను వసూలు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే గ్యాస్‌కు సబ్సిడీ నగదుని పాత బకాయిల కింద జమచేసుకుంటున్నారు. అంతేగాక డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు రుణాలు మంజూరైనా వారి భ ర్తలెవరికైనా బ్యాంకు రుణాలుంటే దానిని జమవేసుకునేందుకు బ్యాంకర్లు ప్రయత్నిస్తున్నారు.

 
ఆధార్‌తో దొరికిపోతారు

బ్యాంకుల్లో బకాయిలున్న కొందరు రైతులు మాత్రం ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మి తమ కుటుంబీకుల బ్యాంకు ఖాతాలను ఇచ్చారు. మరికొందరు రైతులు అప్పున్న బ్యాంకులో కాకుండా ఇతర బ్యాంకు ఖాతాలను అందజేశారు. కానీ అన్ని బ్యాంకుల్లోనూ ఆధార్‌కార్డు అనుసంధానం జరిగింది కాబట్టి ఎవరికి ఏ బ్యాంకులో ఖాతా ఉంది.. అందులోని బ్యాలెన్స్ వివరాలు సులభంగా తెలిసిపోతుంది. దీంతో బ్యాంకర్లకు రైతుల నుంచి అప్పులు రికవరీలు చేయడం కష్టమైన పనేమీ కాదు.

 
కొందరు ప్రైవేటు వ్యాపారులకే..

ధాన్యాన్ని అమ్మి, బ్యాంకు ద్వారా నగదు తీసుకోవడం ఇబ్బందులతో కూడిన విషయం అని తెలుసుకున్న కొందరు రైతులు ప్రైవేటు వ్యాపారులకే తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.1,400 ధర ఇస్తున్నా బ్యాంకర్ల నుంచి నగదు తీసుకోవాలి కాబట్టి నష్టపోయినా ప్రైవేటు మిల్లర్లు, వ్యాపారులకు కేవలం రూ.1.100లకే అమ్ముకుంటున్నారు. స్థానికంగా కర్ణాటక వ్యాపారులు టెంపోలతో సహా గ్రామాలకు వచ్చి  రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు  చేస్తున్నారు.

మరిన్ని వార్తలు