మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ ఎస్కేప్..

15 Dec, 2014 21:20 IST|Sakshi

అనంతపురం క్రైం : కడప, అనంతపురం జిల్లాల్లో పలు కిడ్నాప్ కేసుల్లో ప్రధాన నిందితుడు, గ్యాంగ్ లీడర్, బలవంతపు వసూళ్లకు పాల్పడే వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ తప్పించుకోవడం సంచలనం కల్గిస్తోంది. సెక్యూరిటీగా ఉండే ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్ల కళ్లుగప్పి పరారీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కేసు విషయమై కడప సబ్‌జైలులో ఉన్న సునీల్‌ను గురువారం ఉదయం అనంతపురం ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు ఇంతియాజ్ అహమ్మద్ (1977), వెంకటరమణారెడ్డి (2177) అనంతపురం కోర్టుకు తీసుకొచ్చారు. అనంతరం కడపకు తీసుకెళ్లారు.
 
 అయితే సబ్‌జైలు సమీపంలో సునీల్ పరారయ్యాడు. ఇంతటి కీలకమైన నిందితుడి విషయంలో సెక్యూరిటీ సిబ్బంది అజాగ్రత్తగా ఎలా వ్యవహరించారనేది అర్థం కాని విషయం. వీరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ సెక్యూరిటీ పోలీసుల కళ్లగప్పి పారిపోవడాన్ని అనంతపురం ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు తీవ్రంగా పరిగణించారు. ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు ఇంతియాజ్ అహమ్మద్, వెంకట రమణారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సునీల్ పోలీసుల చెర నుంచి తప్పించుకోవడం అటు పోలీసులు, ఇటు ప్రజలను కలవరపెడుతోంది. బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం, కిడ్నాప్ చేయడం, చివరకు హత్యలు చేసేందుకు కూడా వెనుకాడని సునీల్ తప్పించుకోవడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. సునీల్‌ను పట్టుకోవడానికి పోలీసు బృందాలు వేట ప్రారంభిం చాయి.  కాగా, సునీల్ నేర చరిత్ర తెలిసీ అతడి చేతులకు  బేడీలు వేయకుండా కోర్టుకు తీసుకురావడం చర్చనీ యాంశమైంది.
 

మరిన్ని వార్తలు