చర్చలకు పిలిచి అరెస్టులా? | Sakshi
Sakshi News home page

చర్చలకు పిలిచి అరెస్టులా?

Published Sat, Dec 13 2014 1:46 AM

Concern for the working families

- సింథటిక్ కార్మికులపై పోలీసుల దాష్టీకం
- యాజమాన్యం కొమ్ము కాసిన పోలీస్‌శాఖ
- బైండోవర్ కేసులు బనాయించి విడిచిపెట్టిన వైనం
- ఆందోళనలో కార్మిక కుటుంబాలు

రాజాం రూరల్: స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని అంతకాపల్లి పంచాయతీ సమీపంలో ఉన్న సింథటిక్ కర్మాగార యాజమాన్యం పోలీసులతో కుమ్మక్కై కార్మికులపై అమానుషంగా ప్రవర్తించింది. కర్మాగార అక్రమ లే-ఆఫ్‌కు నిరసగా కార్మికులు చేపట్టిన ఆందోళనలకు దిగివచ్చినట్టు నటించిన యాజమాన్యం పోలీసులను రాయబారిగా పెట్టి సెటిల్‌మెంట్ చేస్తామని పిలిపించి అరెస్టు చేయించింది.

పోలీసులు సైతం యాజమాన్యానికి కొమ్ముకాసి కార్మికులపై నిర్దయగా వ్యవహరించారు. వివరాలివీ.. సింథటిక్ కర్మాగారం నష్టాల్లో నడుస్తోందని చెప్పి యాజమాన్యం ఈ ఏడాది ఆగస్టు 8న అకస్మాత్తుగా లేఆఫ్ ప్రకటించింది. దీంతో సుమారు 150 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఆందోళన చేపట్టగా నెలలో సగం జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఆగస్టు, సెప్టెంబర్ లేఆఫ్ జీతాలు చెల్లించి తర్వాత నెలల జీతాలు చెల్లించకుండా చేతులెత్తేసింది. దీంతో కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు.

అనంతరం స్పందించిన యాజమాన్యం కార్మికులకు పూర్తిగా సెటిల్‌మెంట్ చేస్తామని ఈ నెల 9న పిలిపించినా, ఎంతోకొంత పెట్టి పంపించేసే ధోరణిలో పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడారు. దీనిని వ్యతిరేకించిన కార్మికులు వెంటనే కర్మాగార సిబ్బందిని నిర్బంధించి ఆందోళన చేపట్టారు. ఇన్‌చార్జ్ సీఐ తమ్మినేని సీతారాం రంగప్రవేశం చేసి యాజమాన్యంతో మాట్లాడి రెండురోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు వెనుదిరిగారు. అయితే శుక్రవారం మరోమారు చర్చలు జరుపుకుందాం రమ్మంటూ కార్మికులను యాజమాన్యం పిలిచింది. అంతకు ముందే పోలీసులను ఆశ్రయించి కార్మగారం చుట్టూ రక్షణ ఏర్పాటు చేసుకుంది.

సుమారు 10 మంది పోలీసులు ఉదయం 7 గంటలకే సంఘటన స్థలానికి చేరుకున్నారు. యథావిధిగా 10 గంటలకు వచ్చిన కార్మికులు శాంతియుతంగా ధర్నా కొనసాగించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉన్నతాధికారుల ఒత్తిడి అధికమవ్వడంతో సీఐ సీతారాం తన సిబ్బందితో వచ్చి కార్మికులందరినీ అరెస్టు చేశారు. దీంతో కార్మిక కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.

రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తే ఎలా అంటూ నిలదీశారు. తక్షణమే యాజమాన్యం దిగి వచ్చి కార్మికులకు న్యాయం చేయాలని, లేకుంటే పోలీస్ స్టేషన్‌లోనే నిర శన కొనసాగిస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు పాలకొండ డీఎస్పీని సంప్రదించారు. ఆయన ఆదేశాల మేరకు కార్మికులందరిపైనా బైండోవర్ కేసులు నమోదు చేసి పూచీకత్తులపై విడిచిపెట్టారు.

Advertisement
Advertisement