రగులుతున్న ఉద్యమం

21 Aug, 2013 03:05 IST|Sakshi

బ్రిటీష్ వాళ్లే నయం.. అనిపించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ప్రశాంతంగా ఆందోళన చేపడితే తమకు అభ్యంతరం లేదని చెప్పిన పోలీసు పెద్దలు మాట మార్చారు. ఎక్కడికక్కడ ఉద్యమానికి బ్రేకులు వేసేందుకు చేయని ప్రయత్నం లేదు. అత్యాధునిక తుపాకులతో సాయుధ బలగాలను నడిరోడ్డుపై దింపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మంగళవారం ర్యాలీలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సోమవారం రాత్రి ప్రైవేట్ పాఠశాలల యజమానులను హెచ్చరించారు. పలువురిని బైండోవర్ చేశారు.
 
 విద్యార్థి సంఘం నేతలపై ఇదివరకే కేసులు నమోదు చేసినట్లు సృష్టించి బెదరగొడుతున్నారు. ఎవరెవరు ఉద్యమంలో పాల్గొంటున్నారన్న వివరాలను ఇంటెలిజెన్స్ పోలీసులు.. విలేకరుల ముసుగులో సేకరిస్తున్నారు. పోలీసులే సమైక్యవాదులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నా, ప్రజలు సంయమనం పాటిస్తూ సమైక్య ఆందోళనను హోరెత్తిస్తుండం వారికి మింగుడు పడటం లేదు.
 
 కేసులు పెట్టడం.. బైండోవర్లు చేయడం మంచిది కాదని, ఉద్యమానికి సహకరించాలని విద్యార్థులు పోలీసులకు విన్నవించారు. ఉద్యమంపై ఉక్కుపాదం మోపాలని చూస్తే విద్యార్థుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. రెండు గంటల పాటు విద్యార్థులు స్టేషన్‌ను ముట్టడించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసు అధికారులు సర్ది చెప్పడంతో విద్యార్థులు శాంతించారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో వేలాది మంది ఉద్యోగులు నగరంలో ప్రదర్శన నిర్వహించారు.
 
 అనంతరం ర్యాలీగా తపోవనం జాతీయ రహదారిపైకి వెళ్లారు. అక్కడ రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అనుమతి లేకుండా రాస్తారోకో చేస్తున్నారని, వెంటనే విరమించకపోతే అరెస్టు చేయాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించడంతో... తాము బెదిరింపులకు భయపడేది లేదని ఎన్జీవోలు తెగేసి చెప్పారు. అనంతరం ఎన్జీవోలే స్వచ్ఛందంగా ఆందోళన విరమించడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. న్యాయవాదుల ఆధ్వర్యంలో నగరంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు నగరంలో ప్రదర్శన నిర్వహించి.. రిలే దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం ప్రకటించారు.
 
 సమైక్యాంధ్రకు మద్దతుగా నగరంలో వైద్యులు, పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవో, గెజిటెడ్ ఉద్యోగులు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఆర్ట్స్ కళాశాల వద్ద శిబిరంలో అధ్యాపకులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఇక నగరంలోని ప్రతి వీధికి చెందిన మహిళలు, వృద్ధులు, చిన్నారులు స్వచ్ఛందంగా రోడ్లపైకి తరలివచ్చి.. జయహో సమైక్యాంధ్ర అని నినాదాలు చేశారు. అనంతరం సప్తగిరి సర్కిల్‌లో సోనియా, కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. టవర్ క్లాక్ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కాగా ఆర్ట్స్ కళాశాల, తహశీల్దార్ కార్యాలయం, తెలుగుతల్లి కూడలి, ప్రభుత్వ ఆస్పత్రి, డీఎంఅండ్‌హెచ్‌ఎ కార్యాలయం ఎదుట, పెన్నార్ భవనంలో జాక్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు, జాతీయ రహదారులు, ఆస్పత్రి ఉద్యోగులు, సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
 
 ఎస్కేయూలో ఆరని ఉద్యమ జ్వాలలు
 ఎస్కే యూనివర్సిటీలో ఉద్యమ సెగ ఎగిసిపడుతోంది. మంగళవారం విద్యార్థులు యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించారు. మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. వర్సిటీ సమీపంలోని ఆకుతోటపల్లికి చెందిన మహిళలు జాతీయ రహదారిపై బైఠాయించి.. వాహనాలను అడ్డుకున్నారు. సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
 ఊరూవాడ సమైక్యమే..
 ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ సమన్వయక్త తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఐక్య ఉపాధ్యాయ సంఘం, ఆర్టీసీ కార్మికులు బస్సులతో ర్యాలీ నిర్వహించారు. బత్తలపల్లిలో మాదిగ దండోరా నేతలు నిరసన తెలిపారు. ముదిగుబ్బలో ఉపాధ్యాయ సంఘం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ.. ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుత్తిలో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించి.. రోడ్లపైనే వంటావార్పు చేశారు. జాక్టో దీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో సమైక్యవాదులు రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. హిందూపురంలో దండోర నేతలు భారీ ప్రదర్శన నిర్వహించారు. చిలమత్తూరు, లేపాక్షిలో సమైక్యాంధ్రకు మద్దతుగా మాదిగల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కదిరిలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మున్సిపల్ ఉద్యోగులు, ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు, కూరగాయల వ్యాపారులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ చేశారు. కళ్యాణదుర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధించారు. జేఏసీ దీక్షలు కొనసాగుతున్నాయి. మడకశిరలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలోనూ, అమరాపురంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా సమైక్య వాదులు ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించారు. పెనుకొండలో వేమనరెడ్డి సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సోమందేపల్లిలో సమైక్యవాదులు బైక్ ర్యాలీ చేశారు. రొద్దం, పరిగి, గోరంట్లలో ర్యాలీలతో నిరసన తెలిపారు.
 
 రాయదుర్గంలో భవననిర్మాణ మేస్త్రీలు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్ల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు. కాగా సమైక్యాంధ్ర కోసం ఎస్‌ఎస్ వలి చేపట్టిన ఆమరణ దీక్ష ఆరో రోజుకు చేరింది. వస్త్ర వ్యాపారులు ర్యాలీ చేశారు. కణేకల్లులో అర్చకులు, అంగన్‌వాడీలు ర్యాలీ నిర్వహించారు. రాప్తాడు, ఆత్మకూరు, రామగిరిల్లో సమైక్యవాదులు ర్యాలీలు చేపట్టారు. శింగనమలలో ఆటోడ్రైవర్లు తాడిపత్రి రోడ్డుపై రాస్తారోకో చేసి.. సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు.
 
 నార్పల నుంచి అనంతపురం వరకు సమైక్యవాదులు పాదయాత్ర చేపట్టారు. పుట్లూరులో విద్యుత్ ఉద్యోగులు వంటావార్పు నిర్వహించారు. తాడిపత్రిలో జేఏసీ, మునిసిపల్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్‌కో, ఆర్టీసీ ఉద్యోగులు పట్టణంలో భారీ ప్రదర్శన చేశారు. యాడికిలో టైలర్లు రోడ్డుపైనే దుస్తులు కుట్టి నిరసన తెలిపారు. ఉరవకొండలో స్వర్ణకారులు రోడ్డుపైనే పని చేసి.. నిరసన తెలిపారు.
 

మరిన్ని వార్తలు