అరుదైన గౌరవం

5 Jul, 2019 07:40 IST|Sakshi

స్పీకర్‌ సీటులో ఎంపీ మిథున్‌రెడ్డి

ప్యానల్‌ స్పీకర్‌ హోదాలో లోక్‌సభ నిర్వహణ 

ఆధార్‌ సవరణ బిల్లుపై చర్చ సాగించిన ఎంపీ 

సాక్షి, కడప : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం స్పీకర్‌ స్థానంలో కొలువుదీరారు. ప్యానల్‌ స్పీకర్‌ హోదాలో లోక్‌సభను నిర్వహించారు. ఆధార్‌ సవరణ బిల్లు చర్చ సందర్భంగా అధ్యక్షత వహించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ సభకు హాజరు కాలేని సమయంలో ప్యానల్‌ స్పీకర్‌ లోక్‌సభను నిర్వహించడం సాంప్రదాయం. ఈక్రమంలో ప్యానల్‌ స్పీకర్‌గా అధ్యక్ష స్థానంలో ఆయన కొలువుదీరారు. రాజంపేట నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికైన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ప్యానల్‌ స్పీకర్‌ అవకాశం దక్కింది. దీంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన నాయకుడు భారత అత్యున్నత చట్టసభకు స్పీకర్‌గా విధులు నిర్వహించడంతో వారి ఆనందానికి హద్దేలేకుండా పోయింది. ఎంపీగా లోక్‌సభలో ప్రభుత్వతీరును ఎండగట్టి నేడు అదే లోక్‌సభలో చిన్న వయసులోనే ప్యానెల్‌ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టడం నిజంగా గర్వకారణమని అంటున్నారు.

2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా తొలిసారి బరిలో నిలిచిన ఆయన బీజేపీ అభ్యర్థి పురందేశ్వరిపై విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అంచెలంచెలుగా ఉద్యమాలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ నిర్ణయం మేరకు పార్లమెంట్‌ అభ్యర్థిత్వానికి రాజీనామా చేశారు. అనంతరం 2019లో మరోమారు ఆయన రాజంపేట నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్లు ఆధిక్యతతో ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఇటీవల ప్యానల్‌ స్పీకర్‌గా నియమితులయ్యారు. ఆమేరకు గురువారం ఆ హోదాలో లోక్‌సభ నిర్వహించారు. ఆధార్‌ సవరణ బిల్లుపై చర్చ జరిపారు.

>
మరిన్ని వార్తలు