విషజ్వరాలు వణికిస్తున్నాయి.. ఆదుకోండి

28 Sep, 2017 03:26 IST|Sakshi

ప్రకాశం జిల్లాలో పరిస్థితిపై కేంద్ర మంత్రికి ఎంపీ వైవీ వినతి

సాక్షి, న్యూఢిల్లీ: విషజ్వరాలతో ప్రకాశం జిల్లాలో రోజుకు నాలుగైదు మరణాలు సంభవిస్తున్నాయని, కేంద్రం తక్షణమే స్పందించి ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మంత్రిని కలసి ఈ మేరకు వినతిపత్రం అందించి.. ప్రకాశం జిల్లాలో పరిస్థితిపై చర్చించారు. ‘డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి విషజ్వరాలతో ప్రకాశం జిల్లా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది విషజ్వరాల ప్రభావం అధికంగా ఉంది. అధికారిక అంచనా ప్రకారం గత నెలలో 30 నుంచి 40 మంది విషజ్వరాలతో చనిపోయారు. కానీ అనధికారికంగా ఈ సంఖ్య 100 వరకూ ఉంటుంది. తాగునీటి సమస్య ఉండటంతో ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారు.

డెంగీ వంటి రోగాలు విస్తరిస్తున్నాయి. జిల్లాలో పెద్ద ఆస్పత్రి అయిన రిమ్స్‌లో కనీసం ప్లేట్‌లెట్స్‌ సంఖ్య నిర్ధారించే సదుపాయం కూడా లేకపోవడం దారుణం. మరణాల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఓ  కారణం. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందున కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రిమ్స్‌తో పాటు ఇతర ప్రధాన ఆస్పత్రుల్లో సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అన్ని గ్రామాల్లోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధులను విష జ్వరాల నియంత్రణకు, పారిశుధ్యానికి వినియోగించేలా ఆదేశాలివ్వండి. ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది ఎందుకు ఇన్ని మరణాలు సంభవించాయో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించడంతో పాటు భవిష్యత్‌లో ఈ పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని మంత్రిని కోరారు. తన విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు.

మరిన్ని వార్తలు