అంతుచిక్కని కారణాలు!

8 Jan, 2014 02:05 IST|Sakshi
అంతుచిక్కని కారణాలు!

ఉదయ్ కిరణ్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలేంటి?  వివిధ కోణాల్లో ఆరా తీస్తున్న పోలీసులు
తమిళ సినిమా వాయిదా పడిందంతే
భార్య విషిత నుంచి ఒకే ఎస్సెమ్మెస్
ఉదయ్ మానసిక స్థితి తెలిసీ ఆమె పార్టీకెందుకు వెళ్లారు?


 సాక్షి, హైదరాబాద్: మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు.. పదో ఏట నుంచే ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు.. అనుకోకుండా తెరంగేట్రం చేసి స్టార్‌డమ్ సంపాదించాడు.. కోట్లకు పడగలెత్తకపోయినా అవసరాలకు తగినన్ని వనరులు ఉన్నాయి.. ఏడాదిన్నర క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు.. ఇలాంటి వ్యక్తి కేవలం ఆర్థిక ఇబ్బందులు, సినిమా అవకాశాలు లేవనే కారణంతో ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా తనువు చాలి స్తాడా..? సినీ నటుడు ఉదయ్‌కిరణ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులను పట్టిపీడిస్తున్న అనుమానాలివీ! ఉదయ్ హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన కారణాలు అంతుచిక్కకపోవడంతో వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నామని పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ఉదయ్‌కిరణ్ నటించాల్సిన తమిళ సినిమా కూడా రద్దు కాలేదని, కేవలం ఫిబ్రవరి వరకు వాయిదా మాత్రమే పడినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.

 ఆత్మహత్య చేసుకోవాల్సిన ఆర్థిక కారణాల్లేవు..

 సినీ నటుడు ఉదయ్‌కిరణ్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తోంది. ఉదయ్ పదేళ్ల వయస్సు ఉన్నప్పుడే.. అప్పటికి 21 ఏళ్ల వయస్సున్న అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి దాదాపు ఆరేళ్ల క్రితం చనిపోయారు. అనివార్య కారణాల వల్ల తండ్రితో విభేదాలు తలెత్తి ఆరేళ్లుగా ఆయనకు దూరంగా ఉంటున్నాడు. సినీ రంగంలో అతితక్కువ కాలంలోనే ఓ వెలుగు వెలిగినా ఆ తర్వాత వివిధ కారణాల వల్ల అవకాశాలు దెబ్బతిన్నా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు బెంజ్ కారును వినియోగించినా ప్రస్తుతం సాధారణ కారుకే పరిమితమయ్యాడు. ఇన్ని అనుభవాలను చవిచూసిన ఉదయ్ జీవితంలో రాటుదేలి ఉంటాడని, ఉన్నట్టుండి ఇలా ఆత్మహత్య చేసుకోడని పోలీసులు చెప్తున్నారు. సినిమాల్లో అవకాశాలు సన్నగిల్లడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆదివారం రాత్రి వరకు పోలీసులు కూడా భావించారు. అయితే ఆత్మహత్య చేసుకోవాల్సినంత స్థాయిలో ఆర్థిక ఇబ్బందులు లేవని దర్యాప్తులో తేలింది. ఉదయ్‌కిరణ్‌కు నగర శివార్లలో రెండుమూడు స్థలాలు ఉన్నట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు.

 ‘లవ్ యూ’ లేదు.. ‘ఐ టూ’ లేదు..!

 ఉదయ్ ఆత్మహత్య జరిగిన వెంటనే ప్రాథమికంగా విచారణ చేపట్టిన పోలీసులకు కొందరు చెప్పిన వివరాలు, తర్వాత వెలుగులోకి వస్తున్న అంశాల మధ్య పొంతన లేనట్లు స్పష్టమవుతోంది. చనిపోవడానికి ముందు ఉదయ్‌కిరణ్ రాత్రి 7.40 గంటల ప్రాంతంలో తన భార్య విషితకు చివరిసారి ‘ఐ లవ్ యూ’ అని ఎస్సెమ్మెస్ చేశారని, అందుకు బదులుగా విషిత ‘ఐ టూ లవ్ యూ’ అని పంపించినట్లు సంబంధీకులు పోలీసులకు తెలిపారు.

అయితే కాల్‌డేటాలను విశ్లేషించిన పోలీసులు ఆదివారం మొత్తమ్మీద ఉదయ్‌కిరణ్ ఫోన్‌కు సంబంధించి నాలుగు కాల్స్, ఒక్క ఎస్సెమ్మెస్ మాత్రమే ఉన్నట్లు తేల్చారు. వీటిలో విషితతో పాటు ఆమె స్నేహితుడు శరత్‌కు నాలుగు కాల్స్ ఉన్నాయి. ఒక్క ఎస్సెమ్మెస్ మాత్రం విషిత నుంచి ఉదయ్‌కిరణ్‌కు వచ్చింది. అందులో ఎక్కడా ‘లవ్’ ప్రస్తావన లేదని పోలీసులు చెబుతున్నారు. ‘సెల్ చార్జింగ్ లేదు’ అన్న సందేశమే ఉందని స్పష్టం చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఉదయ్ రెండుసార్లు విషితకు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదని తెలుస్తోంది. విషిత కాల్‌డేటాలో మొత్తమ్మీద 29 ఫోన్‌కాల్స్ ఉండగా... రెండు మాత్రమే ఉదయ్‌కిరణ్‌కు సంబంధించినవని తేలింది. పోలీసులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శరత్‌ను ప్రశ్నించామని... కేవలం బర్త్‌డే పార్టీకి వస్తావా? రావా? అనే దానిపైనే తాము మాట్లాడుకున్నట్లు అతడు చెప్పాడని పోలీసులు తెలిపారు. రోహిత్ పుట్టినరోజు వేడుకలకు ఈయన కారులోనే విషిత వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అనుమానాస్పద అంశాలు ఇప్పటి వరకు బయటపడలేదని, మరికొందరు విషిత స్నేహితులు, ఆమెతో సన్నిహితంగా ఉండే వారినీ ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు.

 రాత్రి ఎందుకు భోజనం చేయలేదు?

 ఉదయ్ ఆదివారం రాత్రి 10.30-11.30 గంటల మధ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఆ సమయానికి కనీసం మూడు గంటల లోపు ఏమీ తిన్న ఆనవాళ్లు లేవని వైద్యులు నిర్ధారించారు. విషిత తన స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లడం, ఉదయ్ భోజనం చేయకపోవడం మధ్య ఏమైనా సంబంధం ఉందా? అన్న అంశంపైనా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఉదయ్ ఎడమ చేతిపై చాలాకాలం కిందట కోసుకున్న గాట్ల గుర్తులు, కుడిచేతిపైన భార్య పేరుతో కూడిన టాటూ ఉన్నట్లు ఫోరెన్సిక్ అధికారులు పోలీసులకు తెలిపారు. చనిపోయే ముందు ఉదయ్‌కిరణ్ సూసైడ్ నోట్ ఏదైనా రాశాడా అన్న అంశాన్నీ లోతుగా ఆరా తీస్తున్నారు.

 భార్య దూరమవుతోందని..

 మంగళవారం రాత్రి ఉదయ్ భార్య విషితతో పాటు ఆమె తల్లిదండ్రులు మేఘల, గోవిందరాజన్‌లను పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ మూడు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. భార్య, అక్క, బావలతో పాటు అత్తమామలు, విషిత స్నేహితులైన శరత్, రోహిత్‌లను విచారించాం. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి భార్య ఎక్కువ సమయం ఆఫీసులో ఉండిపోవడం, తనకు దూరమవుతోందని భావించడం, ఆర్థిక ఇబ్బందులకు, సినీ రంగంలో సన్నిహితులే అవహేళన చేయడం, ఇవన్నీ ఆత్మహత్యకు కారణాలుగా ప్రాథమికంగా భావిస్తున్నాం’’ అని చెప్పారు.

ఆదివారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ విషయంలో భార్యాభర్తల మధ్య తగాదా జరిగిందని పేర్కొన్నారు. ‘‘ఆ రోజు ఆమె నిద్రలేవడం ఆలస్యం కావడంతో తనను సరిగ్గా పట్టించుకోవట్లేదంటూ గొడవకు దిగినట్లు తెలిసింది. ఇటీవల తమిళనాడులోని చెన్నైలో స్థిరపడదామని భావించిన ఉదయ్‌కిరణ్ అక్కడ ఓ ఇల్లు చూద్దామని వెళ్లారు. అయితే ప్రస్తుతం హీరో కాదనే ఉద్దేశంతో యజమాని ఇల్లు ఇవ్వమని చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది. గతంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పుడు ఉదయ్‌కిరణ్ తన చేతులు, తొడపై గాట్లు పెట్టుకున్నారని గుర్తించాం. గతంలో ఉదయ్‌కిరణ్ వద్ద మేనేజర్‌గా పని చేసిన మున్నా నిర్మాతగా మారి ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ సినిమా నిర్మాణానికి ఉపక్రమించారు. ఇందులో ఓ హీరోయిన్ కూడా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మధ్యలో ఆగిపోవడంతో సదరు హీరోయిన్ వచ్చి ఉద య్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం మున్నాను విచారిస్తాం’’ అని డీసీపీ చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు