వంచించిన ప్రేమికునికే పోలీసుల వత్తాసు!

24 Jan, 2014 01:05 IST|Sakshi
 మలికిపురం, న్యూస్‌లైన్ : ప్రేమిస్తున్నానన్న తియ్యనిమాటలతో నమ్మించి, కమ్మనికలల్లో తేలియాడించిన వాడే ఇప్పుడు దిగమింగుకోలేని చేదును చవి చూపిస్తున్నాడని ఆ యువతి వాపోతోంది. ‘బాధితుల రక్షణే ధ్యేయం’ అనే పోలీసులు..బాధితురాలైన తనకు న్యాయం చేయడం మాని తనను బాధించిన వాడికి బాసటగా నిలిచారని ఘోషిస్తోంది. ఆరునెలలుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్న తనకు న్యాయం     ఇంకెప్పుడు జరుగుతుందని ఆక్రోశిస్తోంది. ఆ యువతి పేరు చలమలశెట్టి దుర్గాభవాని. వయసు 20 ఏళ్లు. ఊరు మలికిపురం మండలం లక్కవరం. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ యువతి ఆరేళ్ల క్రితం కుట్టుపని నేర్చుకుని తల్లిదండ్రులకు ఆసరాగా ఉందామనుకుంది. ఆ పని నేర్చుకోవడానికి వెళ్లే సమయంలో అదే ఊరికి చెందిన నాగిరెడ్డి సోమరాజు అనే యువకుడు ఆమె వెంటపడ్డాడు.
 
 ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళుతున్నప్పుడు కూడా భవానిని పెళ్లి చేసుకుంటాననే చెప్పాడు. తాను తిరిగి వచ్చే నాటికి ఆమెకు మైనారిటీ తీరుతుంది గనుక పెళ్లికి అడ్డంకి ఉండదన్నాడు. ఆ మాటలు నిజమని నమ్మిన భవాని సోమరాజు తిరిగి వచ్చే రోజు కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూసింది. ఆరునెలల క్రితం లక్కవరం వచ్చిన సోమరాజు పెళ్లి సంగతి ప్రస్తావిస్తే ముఖం చాటేశాడు. దీంతో భవాని విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకు వెళ్లింది. భవానిని పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో చెప్పిన సోమరాజు ఆనక పరారయ్యాడు. దీంతో భవాని అప్పుడే మలికిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
 అప్పటి నుంచీ న్యాయం చేయమని పోలీసుస్టేషన్‌కు వచ్చి ప్రాధేయపడుతూనే ఉంది. అయితే వారు ‘అదిగో.. ఇదిగో’ అంటూ కాలం వెళ్లదీశారే తప్ప సోమరాజు ఆచూకీ కనిపెట్టలేదు. తీరా చూస్తే సోమరాజు తిరిగి గల్ఫ్ వెళ్లిపోయాడని తేలింది. సోమరాజు పెద్దల ప్రలోభాలకు లొంగి కావాలనే పోలీసులు తాత్సారం చేశారని భవాని ఆరోపిస్తోంది. కూలి పనితో కుటుంబాన్ని పోషించే ఆమె తండ్రి నాగేశ్వరరావు బిడ్డ భవిష్యత్తు ఏమిటని కుమిలిపోతున్నాడు. ప్రేమించిన వాడు పెళ్లాడతానని నమ్మించి మోసగించాడని, న్యాయం చేయాల్సిన పోలీసులు కూడా అతడికే కొమ్ము కాసి తనకు అన్యాయం చేశారని భవాని ఆరోపిస్తోంది. గత ఆరు నెలలుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తనకు ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుతోంది. 
 
మరిన్ని వార్తలు