సభ్యసమాజానికి.. సందేశమిస్తూ..

20 Mar, 2018 12:53 IST|Sakshi
ప్రేమించే వయసేనా నాటికలో సన్నివేశం

కాకినాడ, రాజమహేంద్రవరంలో సాగుతున్న నంది నాటకోత్సవాలు

ఆలోచింపజేసిన ‘ఎప్పుడో ఒకప్పుడు’ నాటకం

కాకినాడ కల్చరల్‌: స్థానిక ది యంగ్మెన్స్‌ హాపీ క్లబ్‌ దంటు కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్‌ చలచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలు–2017 తొమ్మిదో రోజు ఆకట్టుకున్నాయి. సోమవారం ఉదయం శ్రీషిరిడీ సాయి కల్చరల్‌ అసోసియేషన్‌ (అనకాపల్లి) సమర్పణలో ‘ఎప్పుడో ఒకప్పుడు’ సాంఘిక నాటకం పి.ముత్యాలు దర్శకత్వంలో ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకొంది. వరకట్నం దురాచారంపై విన్నూత్న రీతిలో నాటకం ప్రదర్శించి  ప్రేక్షకులను ఆలోచింపజేశారు. పైకి మంచి వాడిగా, అభ్యుదయ భావాలున్న వ్యక్తిగా నటిస్తూ తనంలో మహిళల పట్ల క్రూర మనస్తత్వం కలగిన వంశీ పాత్రధారి ముత్యాలు నటన అద్భుతంగా ఉంది.

ధనికుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆమెపై కపట ప్రేమ ఒలకబోసే ఘట్టాలు, చివరకు ఆమె ద్వారా ఎటువంటి ఆస్తి రాదని తెలిసిన తర్వాత ఆమెను వదిలించుకొనేందుకు వంశీ చేసే ఘట్టాలు అలరించాయి. అలాగే భార్య పాత్రలో నటించిన జయ నటన మహిళా ప్రేక్షకులను ఆకట్టుకొంది. వంశీ, మరో ధనికుల అమ్మాయి భానుమతిని ప్రేమ ముగ్గులోకి దించి తన భార్యను వదిలించుకునే ఘట్టాలు రక్తి కట్టించాయి. చివరిగా వంశీ తన భార్యను ఫోన్‌ వైర్‌తో హతమార్చేందుకు ప్రయత్నించగా భార్య జయ ఎదురు తిరిగి భర్తను చంపే ఘట్టాలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఆడది అంటే అబల కాదు సబల అనే సందేశాన్ని ప్రేక్షకులకు ఈ నాటకం అందజేసింది.

అనుబంధాల సారం తెలిపిన‘బంధాల బరువెంత’
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర చలనచిత్ర టి.వి. నాటకరంగ అభివృద్ధి సంస్థ నంది నాటకోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో శ్రీవేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఆరో రోజు ఉదయం సాంఘిక నాటిక బంధాల బరువెంత ఆకట్టుకుంది. శ్రీ చైతన్య కళాభారతి, భీమవరం వారి ప్రదర్శించిన ఈ నాటికకు రచన కాళహస్తి నాగరాజు, దర్శకత్వం డాక్టర్‌ సీఎస్‌ ప్రసాద్‌ వహించారు. ప్రస్తుత సమాజంలో అన్నదమ్ముళ్లు, భార్యాభర్తలు, తండ్రీకొడుకుల మధ్య మానవత విలువలు తగ్గిపోతున్నాయని, చాటి చెప్పిన నాటకం. కనుమరుగువుతున్న బంధాల విలువను ఆవిష్కరించిన కథను అద్భుతంగా రక్తికట్టించారు నటీనటులు. శివరామ్‌(సూరిబాబు), నాగేంద్ర(ఎం.శ్రీనివాస్‌)  మరదలు పావని(జ్యోతి), పావని తండ్రి పార్వతీశం(కె.నాగరాజు)తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. అద్భుత నటనను ప్రదర్శించారు.

ఆకట్టుకున్న ‘ఫ్రీడం ఫైటర్‌’
సాంఘిక నాటిక ఫ్రీడం ఫైటర్‌ ఆకట్టుకుంది. శ్రీ చైతన్య కల్చరల్‌ అసోసియేషన్‌ తాడేపల్లిగూడెం వారు ప్రదర్శించిన ఈ నాటికకు రచన డి. నారాయణరావు. దర్శకత్వం కూనిరెడ్డి శ్రీనివాస్‌. సీతరామయ్య(కూనిరెడ్డి శ్రీనివాస్‌) గాంధీ అడుగు జాడల్లో నడిచిన వ్వక్తి. కుమారుడు రవీంద్ర(ఆళ్ల శ్రీనివాస్‌), కోడలు విజయ(రమణ), బలదూర్‌గా తిరిగే మనవడు జగదీశ్‌(కామేష్‌), రవీంద్ర తనుకు వచ్చే రూ.పదివేలతో పాటు తన తండ్రికి వచ్చే స్వాతంత్య్ర సమరయోధుడిని దేశద్రోహులకు సహాయపడాలని కొడుకు, మనుమడు వేధిస్తుంటారు. దీంతో తన వ్వక్తిత్వాన్ని చంపుకోలేక, వారి నుంచి నాకు  స్వాతంత్య్రం కావాలని అందుకే నేను బయటికి వెళ్లిపోతున్నానని చెప్పడంతో కథ ముగుస్తుంది. 

చేవలేని చేయూత
టీవీ సీరియళ్ల ప్రభావం.. అనుమానం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం వారు ప్రదర్శించిన మీ.కో.మె. నాటిక ఆలోచింపజేసింది. ఈ నాటిక రచన దర్శకత్వం డాక్టర్‌ బొక్క శ్రీనివాసరావు వహించారు. అనసూయ(సురభి ప్రభావతి), వెంకట్‌(డాక్టర్‌ బొక్క శ్రీనివాసరావు), శంకరం(బి.వి.హరి) పాత్రధారులు తమ నటనతో ఆకట్టుకున్నారు.

కనువిప్పు కలిగించిన ‘ఆశల పల్లకిలో’..
సాంఘికనాటిక ఆశల పల్లకిలో ఆకట్టుకుంది. బీవీఆర్‌ కళాకేంద్రం, తాడేపల్లిగూడెం వారి ప్రదర్శించిన ఈ నాటికకు రచన బి.జోష్‌మేరీ, దర్శకత్వం టీవీఎం కృష్ణారావు వహించారు. తల్లిదండ్రులను ఎక్కడో ఆశ్రమంలో చేతులు దలుపుకుంటున్న నేటి పిల్లలకు కనువిప్పు కలిగించింది. మనుమలు, మనుమరాళ్లతో కాలక్షేపం చేయాల్సిన వయస్సులో   ఆశ్రమంలో చేర్పించి వారి శేషజీవితాన్ని హరించి వేస్తున్న నేటి తరానికి చక్కటి సందేశాన్నిచ్చారు. శ్రీనివాస్‌(టీవీఎం కృష్ణారావు), తండ్రి రాఘవయ్య(అడ్డగర్ల వేంకటేశ్వరరావు), తల్లి జానకి(రమణ)ల పాత్రలలో జీవించారు.

దేశభక్తిని రగిల్చిన ఐలవ్‌ మై ఇండియా
సూర్యకళా ఆర్ట్‌ క్రియేషన్స్, తాడేపల్లిగూడెం వారు ప్రదర్శించిన ఐ లవ్‌ మై ఇండియా నాటికకు రచన వేల్పుల నాగేశ్వరరావు, దర్శకత్వం మాసా బంగారయ్య వహించారు. నన్ను చంపినా, మళ్లీ పుట్టి బ్రిటిష్‌ సైన్యాన్ని తరిమి కొడతానని, భారతీయుల రక్తంలోనే సౌర్యం, పరాక్రమాలున్నాయని స్వాతంత్య్ర సమరవీరుడు మంగళ్‌పాండే సౌర్యాన్ని చాటిచెబుతూ నేటి తరానికి దేశభక్తిని రగిల్చిన ఐలవ్‌ మై ఇండియా నాటిక. మంగళ్‌పాండే(బంగారయ్య), బ్రిటిష్‌ అధికారి(వి.టి.రాజు), మల్లి(శ్రీలేఖ), దేవుడు(బాబులు), సిపాయిలు(టి.వి.వి.మురళీకృష్ణ, తిరుపతి రావు) ఇందులో నటించారు. మల్లి, దేవుడు భార్యాభర్తలు, దేవుడికి కళ్లు లేకపోయినా మల్లి అతడిని కన్నబిడ్డల చూసుకుంటుంది. మంగళ్‌ పాండే ఆచూకీ చెప్పమని బ్రిటిష్‌ సైనికులు వస్తారు. ఆచూకీ చెప్పడానికి నిరాకరించడంతో మల్లిని చెరచాలని చూస్తారు. దీంతో మల్లి ఆత్మహత్య చేసుకుంటుంది. మరోపక్క మంగళ్‌పాండేను అరెస్టు చేసి ఉరిశిక్ష విధిస్తారు.

ఆకట్టుకున్న ప్రేమించే వయసేనా?
ప్రేమించే వయసేనా ఆకట్టుకుంది. శ్రీ శ్యామలాంబా క్రియేషన్స్‌  పెండ్యాల వారి ప్రదర్శించిన ఈ నాటికకు  రచన జరుగుల రామారావు. దర్శకత్వం శ్రీజ సాదినేని వహించారు.

మరిన్ని వార్తలు