ఇద్దరు గురుకుల విద్యార్థినులకు జాతీయ గుర్తింపు

4 Jul, 2020 08:13 IST|Sakshi
ప్రవల్లిక, వర్షిణి

అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ కమ్యూనిటీ డే ఛాలెంజ్‌ –2020లో ఎంపిక

దేశవ్యాప్తంగా 1,100కు పైగా ఎంట్రీలు నమోదు

30 మంది విద్యార్థులను ఎంపిక చేసిన జడ్జిలు

సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచి ఇద్దరు ఎంపిక  

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన ఇద్దరు గురుకుల విద్యార్థులు జాతీయ స్థాయి గుర్తింపు సాధించారు. నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ మేలో నిర్వహించిన అటల్‌ కమ్యూనిటీ డే ఛాలెంజ్‌ – 2020లో ఈ విద్యార్థులు సమర్పించిన ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఈ ఫలితాలు శుక్రవారం ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ల కోసం 1,100కు పైగా ఎంట్రీలు రాగా అందులో 30 ప్రాజెక్టు ఐడియాలను జడ్జిలు ఎంపిక చేశారు. ఈ 30 ప్రాజెక్టుల్లో రెండు ప్రాజెక్టు ఐడియాలు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో చదివే విద్యార్థులు సమర్పించారు. 

► విశాఖపట్నంలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ గురుకుల విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కేఎల్‌ఎస్‌పీ వర్షిణి ‘పీఐసీఓ’ (పికో–ద కోవిడ్‌ చాట్‌బాట్‌)ను రూపొందించింది. ఇది వాయిస్‌ కమాండ్లు, టెక్టస్‌ మెజేస్‌లను లేదా రెండింటి ద్వారా మానవ సంభాషణలు అనుకరించే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌. ఇది ఏదైనా పెద్ద మేసేజింగ్‌ ఆవర్తనాల ద్వారా ఉపయోగించే ఒక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌. కోవిడ్‌–19 లాక్‌డౌన్, అన్‌లాక్‌ సమయంలో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సహాయం చేయడానికి, ముందస్తు జాగ్రత్తలు చెప్పటానికి, కోవిడ్‌పై పోరాటానికి ‘పికో’ను వర్షిణి పరిచయం చేసింది. వర్షిణి స్వస్థలం విశాఖ జిల్లా బక్కన్నపాలెం. 

► విజయనగరం జిల్లా చీపురుపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గర్భపు ప్రవల్లిక ‘వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం అందించేందుకు డ్రోన్‌లు ఉపయోగించుట’ అనే అంశంపై ప్రాజెక్టును సమర్పించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్‌లు ఉపయోగించి మెడికల్‌ కిట్లతో పాటు ఇతర అత్యవసర సామగ్రిని సరఫరా చేయడం ద్వారా ప్రజల ప్రాణాలు రక్షించవచ్చు. వరద సమయంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలకు మెడికల్‌ కిట్స్‌ సరఫరా చేయడం, పరిస్థితిపై అవగాహన కల్పించడం ఈ ప్రోగ్రాం లక్ష్యం. ప్రవల్లిక స్వస్థలం విజయనగరం జిల్లా తెర్లాం మండలం కుసుమూరు.

► ఈ రెండు ప్రోగ్రామ్‌ల ద్వారా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు దేశవ్యాప్త గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో నిర్వహించే అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ ద్వారా విద్యార్థుల్లోని కొత్తకొత్త ఆలోచనలకు పదును పెడుతున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కల్నల్‌ వి రాములు తెలిపారు.
(అందరూ ఉన్నా అనాథలయ్యారు..)

మరిన్ని వార్తలు