ఇదేం ఎంపిక విధానం?

25 Jan, 2016 00:29 IST|Sakshi

అమలాపురం / కాకినాడ రూరల్ : పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణకు ఎంపిక చేసిన రైతుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉం డడాన్ని, శిక్షణ ఇస్తున్న సమయంలో రైతులు ఇష్టానుసారం బయటకువెళ్లి రావడంపై ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ మండిపడ్డారు.
 
  ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులకు 40 ఏళ్ల లోపు వారిని తీసువస్తే వారికి శిక్షణ ఇచ్చి, సేనాపతులుగా గుర్తించి ప్రకృతి వ్యవసాయ విస్తరణను అంచెలంచెలుగా పెంచాలనేది ఈ శిక్షణ ముఖ్యోద్దేశం. అయితే 80 శాతానికి పైగా 40 ఏళ్లకన్నా పెద్ద వయస్సు ఉన్నవారిని, అది కూడా వృద్ధులను పెద్దఎత్తున తీసుకురావడాన్ని పాలేకర్ తప్పుపట్టారు. ఇదేమి ఎంపిక విధానమని అధికారులను ప్రశించారు. శిక్షణ తీసుకువచ్చేవారి ఎంపిక విషయంలో వ్యవసాయశాఖ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు.
 
 మధ్యాహ్నం శిక్షణ ఆరంభమైన తరువాత పుస్తకాలు పంపిణీ చేయడం, రైతులు పెద్దఎత్తున బయటకు వెళ్లడంపై ఆగ్రహం చెందిన ఆయన అరగంట పాటు శిక్షణ  కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఇంత క్రమశిక్షణ  రాహిత్యాన్ని తాను ఎక్కడా చూడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వయస్సు మళ్లినవారు వెళ్లిపోతే పంపించి వేయాలన్నారు. సోమవారం నుంచి ఉదయం తొమ్మిది గంటలు దాటిన తరువాత రైతులను, వ్యవసాయ శాఖ సిబ్బందిని లోపలికి అనుమతిచ్చేది లేదన్నారు. వ్యవసాయ శాఖ ముఖ్య కారదర్శి విజయకుమార్ కలుగజేసుకుని అధికారులకు సూచనలు చేయడంతో పాలేకర్ శిక్షణ తిరిగి ఆరంభించారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు