ఓయూలో పడకేసిన నావిగేషన్ పరిశోధనలు

10 Feb, 2014 00:12 IST|Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌లైన్: ఓయూ క్యాంపస్‌లో కొనసాగుతున్న నావిగేషనల్ ఎలక్ట్రానిక్స్ పరిశోధన, శిక్షణ కేంద్రంలో ప్రాజెక్టులు, పరిశోధనలు దాదాపు దశాబ్దిగా పడకవేశాయి. న్యూఢిల్లీలోని డిపార్టుమెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ (డీఓఈ) ఆధ్వర్యంలో 1982లో దేశంలోనే ప్రథమంగా ఈ కేంద్రాన్ని స్థాపించారు. ప్రారంభం నాటి నుంచి ఐదేళ్ల వరకు మాజీ రాష్ట్రపతి డాక్టర్.ఏపీజే అబ్ధుల్‌కలాం చైర్మన్‌గా ఉన్నారు.

 తొలిరోజుల్లో అనేక పరిశోధనలు, శిక్షణలు జరిగాయి. ఇలాంటి పరిశోధన కేంద్రం మరెక్కడా ఏర్పాటు కాలేదు. ఇక్కడ అంతరిక్ష  క్షిపణుల తయారీకి పరిశోధనలు జరిగాయంటేనే దీని ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఇంతటి విశిష్ట పరిశోధన కేంద్రం నిర్వహణను 1992లో ఓయూకు అప్పగించారు. నాటి నుంచి కాలక్రమేణ పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు తగ్గిపోయాయి.

 జీపీఎస్ పరిశోధనల ప్రత్యేక కేంద్రం
 ఓయూ నావిగేషన్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (జీపీఎస్) పరిశోధనలకు ప్రత్యేకం. నావిగేషన్ పరిశోధన అంటే ఒక వ్యక్తి యానం గాని, విమానం, సముద్రంలోని ఓడలు, రైలు, రోడ్డుపై వెళ్లే వాహనాలు తదితరాలు ఎక్కడున్నా, ఉన్న స్థితిని తెలియచేసే విధానం. ఇస్రో, డీఆర్‌డీఓ, డీఎస్‌టీ, పలు భారీ పరిశ్రమల ఎలక్ట్రానిక్ అంశాలకు కావాల్సిన పరిశోధనలు ఇక్కడ జరిగేవి.

 9 మందికి గాను ఇద్దరే అధ్యాపకులు ...
 నావిగేషన్  కేంద్రంలో 9 మంది అధ్యాపకులు ఉండాలి. అందులో ముగ్గురు ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం తనతో కలిపి కేవలం ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారని నావిగేషనల్ పరిశోధన, శిక్షణ విభాగం డెరైక్టర్ ప్రొ.దీర్ఘారావు తెలిపారు. అయినా అనేక సమస్యలను అధిగమిస్తూ 46 రీసెర్చ్ ప్రాజెక్టులు, 55 షార్ట్‌టైం కోర్సులు,పలు శిక్షణ  కార్యక్రమాల్ని చేపట్టామన్నారు. అధ్యాపకుల కొరత వల్ల పరిశోధనలు జరగడం లేదన్నారు. ఈ కేంద్రంలో ఖాళీగా ఉన్న  అధ్యాపక, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని ఆయన ఓయూ అధికారులను కోరారు.

>
మరిన్ని వార్తలు