దేదీప్యమానం

21 Oct, 2015 04:04 IST|Sakshi

తిరుమల: ఏడుకొండల వెంకన్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నా యి. మంగళవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై మలయప్ప స్వామి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఉదయం సూర్యకాంతుల మధ్య భాస్కరునిపై తిరునామాల వేంకటనాథుడు బద్రీనారాయణుడి రూపంలో స్వర్ణకాంతులీనుతూ భక్తుల ను కటాక్షించారు. తర్వాత సాయంత్ర వేళలో ఆలయంలో వెలుపల సహస్రదీపాలంకరణ సేవలో స్వామి ఊయలూగుతూ దర్శనమిచ్చారు.

ఆ తర్వాత  రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహనసేవలో చల్లటి చలిగాలులతో కూడిన మంగళధ్వనుల, పండితుల వేద ఘోషలో చల్లనయ్య నవనీత చోరుడి రూపంలో శ్వేత వర్ణ కలువ పువ్వుల అలంకరణలో భక్తలోకానికి తన దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చారు. ఏడో రోజు వాహన సేవల్లో  భక్తుల సందడి తగ్గింది. బుధవారం స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు. ఇక వాహన సేవల్లో  కళాకారులు, వివిధ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కళాకారులు అభినయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయంతోపాటు ఫల, పుష్పప్రదర్శనాలోని  పుష్ప, విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  

శ్రీవారి స్వర్ణ రథోత్సవానికి సర్వం సిద్ధం
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం శ్రీవారి బంగారు రథోత్సవానికి టీటీడీ సిద్ధమైంది. ఇందులో భాగంగా తేరును సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. టీటీడీ చీఫ్ ఇంజినీరు చంద్రశేఖర్‌రెడ్డి  నేతృత్వంలో తొలుత భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, ఆలయ ఇంజినీర్లు రథచక్రాలను పరీక్షించి అన్నీ సవ్యంగా ఉన్నాయని తేల్చారు.

రేపటి చక్రస్నానం కోసం  ఏర్పాట్లు పూర్తి
 బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన గురువారం ఉదయం చక్రస్నానం నిర్వహిస్తారు. వైదికంగా నిర్వహించే ఈ కార్యక్రమ నిర్వహణ కోసం టీటీడీ పుష్కరిణిలో భారీ ఏర్పాట్లు చేసింది.  ఇప్పటికే నీటిని వందశాతం క్లోరినేషన్ చేశారు. ప్రత్యేకంగా ఇనుప చైన్‌లింక్ కంచెలు నిర్మించారు. వరాహస్వామి ఆలయం వద్ద పుష్కరిణిలో సుదర్శన చక్రతాళ్వారుకు పుణ్యస్నానం చేసే ప్రాంతంలో ప్రత్యేక చక్రస్నానం చేసే ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులను ఉదయం 4 గంటల నుంచి పుష్కరిణిలోకి అనుమతిస్తారు. భక్తులు రోజంతా పుణ్యస్నానాలు చేయవచ్చని అర్చకులు, అధికారులు తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు