ఆదికవి నన్నయ వర్సిటీపై నిర్లక్ష్యం

14 Mar, 2016 04:35 IST|Sakshi
ఆదికవి నన్నయ వర్సిటీపై నిర్లక్ష్యం

రాజానగరం : రాష్ట్ర బడ్జెట్‌లో ఉన్నత విద్యకు అతిస్వల్పంగానే కేటాయించారంటూ విద్యారంగానికి చెందిన పలువురు పెదవి విరుస్తున్నారు. రూ.1,35,688 కోట్ల బడ్జెట్‌లో ఉన్నత విద్యకు కేవలం రూ. 2,548 కోట్లు కేటాయిం చగా అందులో జిల్లాకు కేవలం రూ.10 కోట్లే కేటాయించారు. ఆ మొత్తంకూడా తెలుగు యూనివర్సిటీకే కేటాయించి, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన ఆదికవి నన్నయ యూనివర్సిటీని విస్మరిం చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
తెలుగు వర్సిటీకి దక్కిందిలా..

రాష్ట్ర విభజన అనంతరం తెలుగు యూనివర్సిటీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి వారెందరో ప్రభుత్వానికి విజ్ఞాపనలు అందజేశారు. దాంతో రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా  శ్రీకాకుళం, కూచిపూడి శాఖలను అభివృద్ధి చేస్తామన్న పాలకులు ఈ బడ్జెట్‌లో రూ. 50 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పుడు ఆ హామీకి కూడా పూర్తిగా నెరవేర్చకుండా తెలుగు వర్సిటీకి కేవలం రూ.10 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొన్నారు.

సుమారు 40 ఎకరాలు పైబడి భూములు వర్సిటీకి ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఆ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉన్న తెలుగు వర్సిటీని రాష్ర్టంలోని 13 జిల్లాలకు విస్తరించాల్సిన  సమయంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ తెలుగు భాషాభిమానులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు