మంత్రి ఇలాకాలో  మృత్యు ఘోష!

27 May, 2018 08:18 IST|Sakshi
టెక్కలి ఏరియా ఆస్పత్రి  

టెక్కలి : టెక్కలి ఏరియా ఆస్పత్రి తరచూ వివాదాల్లోకి వెళ్తోంది. వైద్యం కోసం వచ్చేవారిలో ఎవరో ఒకరు.. ఏదో ఒక కారణంతో చనిపోతున్నారు. దీనికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతిని ధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆస్పత్రిలోనే తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం టెక్కలి భూలోకమాతవీధికి చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనం ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా వైద్యం కోసం ఏరియా ఆస్పత్రిని ఆశ్రయించారు. చికిత్స అనంతరం యువకుడు మృతి చెందాడు. దీనికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ యువకుడి మృతదేహంతో భూలోకమాతవీధికి చెందిన ప్రజలు ఏరియా ఆస్పత్రిని ముట్టడించారు. పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అక్కడకు కొద్ది 

రోజుల తరువాత ఆంజేయపురం గ్రామానికి చెందిన ఓ మహిళ ఇదే ఆస్పత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందింది. అప్పట్లో గ్రామస్తులు ఆస్పత్రి సిబ్బంది తీరుపై నిరసన చేపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో స్థానిక ఆదిఆంధ్రావీధికి చెందిన ఓ యువకుడు అనారోగ్యం బారిన పడడంతో ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం అతను మృతి చెందాడు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా యువకుడు చనిపోయాడంటూ ఆదిఆంధ్రావీధికి చెందిన వారంతా మృతదేహంతో ఏరియా ఆస్పత్రి ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తాజాగా నందిగాం మండలం పాలవలస గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి అనే బాలింత మృతి చెందడంపై, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రి ఎదుట నిరసన చేశారు. ఇదంతా కేవలం ఏడాది కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు. గతంలో ఇటువంటి సంఘటనలు అనేకంగా జరిగిన దాఖలాలు ఉన్నాయి. అయితే మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గ కేంద్రమైన టెక్కలిలో ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యపు మరణాలు జరుగుతుండడంపై తాత స్థాయిలో మంత్రి వైఫల్యాన్ని ప్రజలు ఎండ గడుతున్నారు. 

వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై పెల్లుబికుతున్న విమర్శలు 
ఏరియా ఆస్పత్రిలో కొంతమంది వైద్య సిబ్బంది అనుసరిస్తున్న తీరు, నిర్లక్ష్యంపై తారస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిండమే కాకుండా అత్యవసర సమయంలో అందుబాటులో ఉండడం లేదంటూ ఆరోపణలున్నాయి. రాత్రి వేళల్లో ఆస్పత్రిలో విధుల్లో ఉండాల్సిన సిబ్బంది కొన్ని సమయాల్లో అందుబాటులో ఉండడం లేదు. అంతేకాకుండా వార్డుల్లో ఉన్న రోగుల పట్ల కూడా సిబ్బంది కసురుకోవడం పరిపాటిగా మారిందంటూ రోగులు చెబుతున్నారు. అలాగే ప్రసూతి విభాగంతో పాటు ఇతర విభాగాల్లో ఆపరేషన్లకు డబ్బులు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగినపుడు ఉన్నతాధికారులు రావడం, ఇరువర్గాలను కూర్చోబెట్టడం సామరస్యంగా రాజీలు చేయడం పరిపాటిగా మారిందం టూ బహిరంగంగా విమర్శలు ఉన్నాయి.  తాజాగా శనివారం జరిగిన బాలింత మృతి విషయంలో ఆపరేషన్‌కు ముందు ఆపరేషన్‌ థియేటర్‌ దగ్గర ఉన్న సిబ్బంది 2100 రూపాయలు తీసుకున్నారని మృతురాలి సోదరుడు ఉన్నతాధికారుల వద్ద రోదిస్తూ చెప్పడం గమనించదగ్గ విషయం. 

మంత్రి ఏం చేస్తున్నారు?
 ఏరియా ఆస్పత్రిలో తరచూ నిర్లక్ష్యపు మరణాలు జరుగుతున్నప్పటికీ మంత్రి ఏం చేస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 
హడావుడిగా ఆస్పత్రిని సందర్శించడం ఆ తరువాత ఆస్పత్రిలో వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయో కనీసం దృష్టి సారించడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రిలో వైద్య సేవలపై ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరో వైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తీసుకునే క్రమశిక్షణ చర్యలు కూడా సన్నగిల్లడంతో, ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణి తీరు మారడం లేదంటూ బాధితులు చెబుతున్నారు. 

మంత్రి మాటలు..
నా నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తా.
– పలు బహిరంగ సభల్లో మంత్రి   అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి.

వాస్తవం ఇలా..
మంత్రి ఇలాకాలోని వంద పడకల ఏరియా ఆస్పత్రిలో కొద్ది రోజులుగా మరణ ఘోష వినిపిస్తోంది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి కూడా బాలింత చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె చనిపోయిందంటూ ప్రజలు ఆందోళనకు దిగారు.

ఆపరేషన్‌కు రూ.2,100 తీసుకున్నారు 
మా చెల్లి లక్ష్మిని కాన్పు కోసం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాం. ఆపరేషన్‌ కోసం థియేటర్‌ వద్దకు తీసుకువెళ్లాం. అక్కడ సిబ్బంది మా దగ్గర 2,100 తీసుకున్నారు. ఆపరేషన్‌ తరువాత పట్టించుకోకపోవడంతో మా చెల్లి మృతి చెందింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వలనే ఈ ఘోరం జరిగింది.
 –గుర్రాల గణపతి,  పాలవలస, నందిగాం మండలం.

సరిగ్గా పట్టించుకోవడం లేదు 
జ్వరం, నీరసంతో వారం కిందట ఆస్పత్రిలో చేరాను. ఇక్కడ సరిగ్గా పట్టించుకోవడం లేదు. నర్సులకు అడిగితే ఏవో మాత్రలు ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఆ మాత్రలు వేసుకున్న తరువాత కడుపులో మంటతో నరకాన్ని చూస్తున్నాను. నర్సులకు అడిగితే కసిరేస్తున్నారు. 
–బొచ్చ రాము, రోగి, భగవాన్‌పురం, టెక్కలి మండలం.

ప్రజా రోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు 
సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గ కేంద్రమైన టెక్కలిలో ప్రజారోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏరియా ఆస్పత్రిలో వరుసగా నిర్లక్ష్యపు మరణాలు సంభవిస్తుంటే మంత్రి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇదేనా ప్రజలకు అందజేసే మెరుగైన వైద్యం. కమీషన్ల వైపే కాకుండా ప్రజల ఆరోగ్యంపై మంత్రి దృష్టి పెడితే మంచిది.  ఏరియా ఆస్పత్రిలో జరుగుతున్న సంఘటనలతో ప్రజలు ఆస్పత్రికి రావాలంటే భయపడుతున్నారు. ఈ సంఘటనలపై ప్రజలకు మంత్రి సమాధానం చెప్పాలి.        
–పేరాడ తిలక్, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, టెక్కలి.
 

మరిన్ని వార్తలు