రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: అఖిలప్రియ

10 Oct, 2014 11:33 IST|Sakshi
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: అఖిలప్రియ

హైదరాబాద్:  తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడు అనుకోలేదని ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి అఖిల ప్రియ అన్నారు. ఆమె శుక్రవారం సాక్షి బ్రేక్ ఫాస్ట్ షో లో తండ్రి భూమా నాగిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతూ ఇంట్లో అమ్మానాన్న రాజకీయాలతో మునిగి తేలేవారని, అయితే వారిని తాము దగ్గర నుంచి పరిశీలించేవారమన్నారు. రాజకీయ నేతలు ఇంట్లో ఉన్నా..రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉన్నామన్నారు. అయితే ఎన్నికలప్పుడు ప్రచారంలో పాల్గొనేవారిమని అఖిలప్రియ తెలిపారు.

రాజకీయాల్లో బిజీగా ఉండి తమకు అమ్మ సమయాన్ని కేటాయించలేకపోయినా తాను, చెల్లి, తమ్ముడు ఎప్పుడూ వెలితిగా ఫీల్ అవలేదని అఖిలప్రియ తెలిపారు. నియోజకవర్గ ప్రజల అమ్మపై చూపే అభిమానం, ప్రేమను చూసి తాము గర్వపడేవారిమని ఆమె అన్నారు. మొదటి నుంచి తనకు బిజినెస్ అంటే ఇష్టమని, ఆవైపుగానే తను అమ్మా,నాన్న ప్రోత్సహించేవారని అఖిలప్రియ తెలిపారు. అమ్మ ఉన్నప్పుడు తన రాజకీయ ప్రవేశం గురించి ఎప్పుడూ చర్చకు రాలేదన్నారు. అయితే ఇప్పుడు అమ్మ స్థానంలో పోటీ చేయటం అనేది తాను ఊహించలేదన్నారు.

ప్రజలకు మంచి చేయాలనే అమ్మ ఆశయాలను నాన్న సాయంతో నెరవేర్చేందుకు కృషి చేస్తానని అఖిలప్రియ తెలిపారు. అమ్మ దూరమై ఇన్ని రోజులు అయినా... ఆమె లేని లోటు ఇంకా ఎక్కువగా తెలుస్తోందన్నారు. కాగా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా దివంగత  నేత భూమా శోభా నాగిరెడ్డి, ప్రస్తుత పీఏసీ ఛైర్మన్ భూమా నాగిరెడ్డిల పెద్ద కుమార్తె భూమా అఖిల ప్రియను పేరును పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు.

మరిన్ని వార్తలు