'గొంతునులిమారు,వారిని వదలకూడదు'

15 Jun, 2014 20:44 IST|Sakshi

విశాఖపట్నం: పెందుర్తి సింహపురి లే అవుట్‌లో ఓ దారుణం జరిగింది. ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి  తరలించారు. నవవధువు ఆత్మహత్యాయత్నం చేసిందని  బంధువులు చెబుతున్నారు. అయితే అత్తింటివారే వేధింపులకు గురి చేసి గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించారని, వారిని వదిలపెట్టకూడదని నవవధువు మేఘావతి బంధువులు ఆందోళనకు దిగారు. మేఘావతి పరిస్థితి విషమంగా ఉంది. ఆమె అపస్మారక స్థితిలో ఉంది.

స్థానికుల కథనం ప్రకారం మేఘావతికి నెల క్రితమే పెళ్లి అయింది. వివాహ సమయంలో కట్నకానుకలు బాగానే ఇచ్చారు. అయినా అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయని మేఘావతి బంధువులు చెబుతున్నారు. తీవ్రజ్వరమంటూ అత్తింటివారు మేఘావతిని ఆస్పత్రిలో చేర్పించారు. అత్తింటివారే మేఘావతిని పీకనులిమి చంపేందుకు ప్రయత్నించారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. వారు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.   మేఘావతి  భర్త, అత్త, బావలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని  స్టేషన్‌కు తరలిస్తుండగా అమ్మాయి తరఫు బంధువులు  అడ్డుకున్నారు.   దాంతో ఆస్పత్రివద్ద  ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు