బైక్‌ రేస్‌లకు కళ్లెం వేయాలి

27 Dec, 2018 13:08 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

సాక్షి, విశాఖపట్నం: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యువకులు నిర్వహించే బైక్‌ రేస్‌లకు కళ్లెం వేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పోలీస్, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 31వ తేదీ రాత్రి బైక్‌ రేస్‌లు జరగకుండా, ప్రమాదాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రోడ్డు సేప్టీపై సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నగరంలో గురువారం నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి 40 కిలోమీటర్ల వేగాన్ని మించి ఎవరూ వాహనాలు నడపకుండా నియంత్రించాలని ఆదేశించారు. పోలీస్, రవాణా శాఖల అధికారులతో స్ఫెషల్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలన్నారు.

రోడ్‌ సేప్టీపై విద్యార్థి దశ నుంచే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కల్పించాలన్నారు. మధురవాడ, బోయపాలెం మధ్య ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ మధ్య ప్రాంతంలో రోడ్డు విభాగిని నిర్మించాలని జీవీఎంసీ నేషనల్‌ హైవే అధికారులను ఆదేశించారు. మల్కాపురం – యారాడ రహదారిలో రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు సైన్‌ బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌.వెంకటేశ్వరరావు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సమావేశ అజెండా అంశాలు వివరించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై నిర్వహించిన చర్యలను వివరించారు. సమావేశంలో రవాణా, ఆర్టీసీ, పోలీస్, జీవీఎంసీ, ఆర్‌ అండ్‌ బీ, నేషనల్‌ హైవే తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు