అధ్యక్షా.. అనాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే

14 May, 2014 10:37 IST|Sakshi
అధ్యక్షా.. అనాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే

కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు అధ్యక్షా అని మైకు పట్టుకుని కౌన్సిల్‌లో ప్రజా సమస్యలపై గళం విప్పాలంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే. మునిసిపల్ ఎన్నికలు జరిగిన 43 రోజుల వరకు ఫలితాల విషయంలో నిరీక్షించిన కౌన్సిలర్లకు పదవీ స్వీకార ప్రమాణ విషయంలోనూ జాప్యం తప్పడం లేదు. వాస్తవానికి మంగళవారం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే న్యాయపరమైన ఇబ్బం దు లు తదితర కారణాల నేపథ్యంలో ఈ ఎన్నిక జూన్ ఒకటి, రెండు తేదీ ల్లోగాని గాని జరిగే అవకాశం లేదు.
 
 మున్సిపల్ కౌన్సిళ్లలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు. అలాంటి కౌన్సిళ్లలో వీరి ఓటు ఒకో సందర్భంలో కీలకంగా మారుతుంది. అయితే గత శాసనసభ రద్దు కావడంతో ప్రస్తుతం మనకు ఎమ్మెల్యేలు లేరు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైతేనే మనకు కొత్త ఎమ్మెల్యేలు వస్తారు. ఆ తర్వాత వారి ప్రమాణ స్వీకారం తదితర కార్యక్రమాలు ఉం టాయి. అలాగే ఎంపీల పదవీ కాలం కూడా ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఎలాంటి న్యాయపరమైన అభ్యంతరాల చట్రంలో మునిసిపల్ ైచె ర్మన్ , వైస్ చైర్మన్ ఎంపికల వ్యవహారం పడకుండా ఎన్నికల కమిషన్ జాగ్రత్తలు తీసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలోగాని కొత్త కౌన్సిలర్లు అధ్యక్షా అనడానికి వీలు లేకుండా పోయింది.
 

మరిన్ని వార్తలు