తెలుగుదేశం దాష్టీకం

7 Apr, 2014 00:36 IST|Sakshi
తెలుగుదేశం దాష్టీకం

సాక్షి, మచిలీపట్నం/ మోగులూరు (కంచికచర్ల రూరల్), న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల తొలివిడత పోలింగ్‌ను పురస్కరించుకొని జిల్లాలో పలు ప్రాంతాల్లో ఓటమి ఉక్రోషంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాష్టీకానికి పాల్పడ్డాయి. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయిలో సామినేని ఉదయభాను అల్లుడు విజయనర్శింహారెడ్ది కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. మక్కపేటలో పోలింగ్ సరళిని చూసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఉదయభానుపై కవ్వింపు చర్యలు చేపట్టారు. మీరెందుకు ఇక్కడికి వచ్చారంటూ వాగ్వివాదానికి దిగారు.
 
వైఎస్సార్‌సీపీ నేతలకు తీవ్ర గాయాలు...

కంచికచర్ల మండలం పరిటాలలో వైఎస్సార్ సీపీ నాయకుడు బత్తిన తిరుపతిరావుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కంచికచర్ల మండలంలోని నక్కలపేటలో టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేసి కొట్టడంతో ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.
 
రాళ్లు రువ్వి.. కర్రలతో దాడి..
 
కంచికచర్ల మండలం మోగులూరులో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బండి జానకిరామయ్యపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటు అడగడాన్ని వారించిన ఆయనపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్లు రువ్వి, కర్రలతో దాడికి దిగారు. దీంతో జానకిరామయ్య తలకు గాయమైంది. ఆయనతోపాటు కన్నెకంటి కృష్ణయ్య, గద్దె వెంకటకృష్ణ, ఆవుల గోపయ్య, షేక్ ఖుద్దూస్, బండి వెంకటేశ్వరరావు కూడా గాయపడ్డారు.

పోలీసులు వారిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జానకిరామయ్యకు తలపై ఐదు కుట్లు పడ్డాయి. మిగిలిన వారు వైద్య సేవలు పొందుతున్నారు. శనివారం రాత్రి గనిఆత్కూరు గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పాటిబండ్ల హరిజగన్నాధరావుపై టీడీపీ స్థానిక నేతలు దాడి చేసి గాయపరిచారు. కుటుంబ సభ్యులు ఆయన్ను నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 
మచిలీపట్నంలోనూ...
 
మచిలీపట్నం మండలంలోని పల్లెతాళ్లపాలెంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఆ ఘటనలో వైఎస్సార్‌సీపీ నాయకుడు చెక్కా కృష్ణారావుకు గాయాలయ్యాయి. తాళ్లపాలెం తదితర ప్రాంతాల్లో టీడీపీ నేతలు కొనకళ్ల బుల్లయ్య, కొల్లు రవీంద్రలు హడావుడి చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నం మండలం గుండుపాలెంలో గెలుపు తమదేనంటూ టీడీపీ కార్యకర్త వీరంగం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే తొడలు కొట్టి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యవహరించారు.
 

మరిన్ని వార్తలు