ఏఎన్‌ఆర్ లేరు.. జ్ఞాపకాలు ఉన్నాయ్..

23 Jan, 2014 03:36 IST|Sakshi
ఏఎన్‌ఆర్ లేరు.. జ్ఞాపకాలు ఉన్నాయ్..
  •      పాకాల, రామప్పలో షూటింగ్‌కు వచ్చిన అక్కినేని
  •      వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణకు కూడా..
  •      నాగేశ్వర్‌రావు మృతితో విషాదంలో అభిమానులు
  •  
     నాగేశ్వర్‌రావు బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూయడాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏఎన్‌ఆర్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.
     
    పోచమ్మమైదాన్ / హన్మకొండ కల్చరల్, న్యూస్‌లైన్ : నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వర్‌రావు మృతి చెందిన విషయం తెలియగానే జిల్లాలోని ఆయన అభిమానుల్లో విషాదం నెలకొంది. బుధవారం తెల్లవారుజాము నుంచే టీవీల్లో స్క్రోలింగ్ రావడంతో అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. అలాగే, చాలా మంది హుటాహుటీన అక్కినేని పార్థివ దేహాన్ని చూసేందుకు హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా పలువురు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ నాగేశ్వర్‌రావుతో తమ అనుబంధం, జిల్లాకు వచ్చినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
     
    వరంగల్‌లో ఏఎన్‌ఆర్ గుర్తులు..
    వరంగల్‌లోని సుశీల్(అప్పటి నవీన్), న టరాజ్(అప్పటి దుర్గ కళామందిర్) సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి ఏఎన్‌ఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
         
    రోజులు మారాయి  సినిమా 100 రోజులు ప్రదర్శించిన సందర్భగా సునీల్ (అప్పటి రాజేశ్వరి) థియేటర్‌లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజంజాహి మిల్లు గ్రౌండ్ నుంచి సునీల్ థియేటర్ వరకు ఎండ్ల బండ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఇదే కార్యక్రమంలో అభిమాన సంఘం అధ్యక్షుడు పోలెపాక మాణిక్యం తాను రూపొందించిన కళాతపస్వి అనే సావనీర్‌ను ఏఎన్‌ఆర్‌కు బహూకరించారు.
         
    దివిసీమ ఉప్పెన వరద బాధితులను ఆదుకునేందుకు ఎన్‌ఐటీ(అప్పటి ఆర్‌ఈసీ)లో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఎన్టీఆర్‌తో కలిసి పాల్గొన్న ఏఎన్‌ఆర్ నగరంలో జోలెతో తిరుగుతూ విరాళాలు సేకరించారు.
         
    కేయూలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమంతో పాటు ఆర్ట్స్ కళాశాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
     
    సినిమా చిత్రీకరణలు
     అక్కినేని నాగేశ్వర్‌రావు నటించిన పలు సినిమాల షూటింగ్ వరంగల్‌లో జరిగింది. నర్సంపేట సమీపంలోని పాకాల చెరువు వద్ద చక్రధర్ సినిమాలోని సంతలో కుండలు అమ్మే సన్నివేశంతో పాటు ఓ ఫైట్‌ను చిత్రీకరించారు. అలాగే, 1966లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఆత్మగౌరవం సినిమా షూటింగ్‌ను రామప్పలో చిత్రీకరించగా, నాగేశ్వర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ వరంగల్ వాసేనని తెలుసుకుని ఓరోజు షూటింగ్ పూర్తయ్యాక అర్ధరాత్రి వెళ్లి కలిశారు.
     
    1968లో అభిమాన సంఘం ఏర్పాటు...
     వరంగల్‌కు చెందిన పలువురు 1968లో ఏఎన్‌ఆర్ ఆర్ట్స్ అసోసియేషన్ పేరిట అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. తొలుత సినిమాల విడుదల సందర్భంగా సంబరాలు నిర్వహించగా, ఏఎన్‌ఆర్ సూచన మేరకు సేవా కార్యక్రమాలు చేపట్టేవారు.  ప్రతీ పుట్టిన రోజు వేడుకలకు వరంగల్ అభిమానులను హైదరాబాద్ పిలిచే అక్కినేని.. 2012లో అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటుచేసిన గెట్ టూ గెదర్‌కు పలువురు ఇక్కడి నుంచి వెళ్లారు.
     
    చిత్రసీమకు తీరని లోటు
    తెలుగు సినీరంగానికి విశిష్ట సేవలు అందించిన అక్కినేని నాగేశ్వరరావు మరణం చిత్ర రంగానికి తీరని లోటు. అందరు అభిమానులతో పాటు నేను కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. నా జీవితంలో ఎన్నో సందర్భాల్లో అక్కినేని నాగేశ్వరావును కలవడం, ఆయనతో కలిపి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం మరిచిపోలేని అనుభూతి.    
     - పొన్నాల లక్ష్మయ్య, రాష్ట్ర మంత్రి
     
     ‘దేవదాసు’పై వ్యాసాన్ని మెచ్చుకున్నారు..
     నేను నల్లగొండ జిల్లాలో లెక్చరర్‌గా, డ్రమెటిక్ క్లబ్ ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పుడు 1966లో నిర్వహించిన నాటికల పోటీలకు అక్కినేని నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలా గే, 1987లో అమెరికా నుంచి వచ్చిన నా మిత్రుడు అక్కినేనిని చూడాలని అనడంతో వెళ్లి మాట్లాడాము. 2002లో నేను నంది అవార్డు కమిటీలో మెంబర్‌గా బాధ్యతలు నిర్వహించి నప్పుడు చివరి రోజున ఆయనే వచ్చి మా అందరినీ కలిసి మాట్లాడి వెళ్లారు. నేను దేవదాసు చిత్రంపై రాసిన వ్యాసాలను  2011లో నేరెళ్ల వేణుమాధవ్‌తో కలిసి వెళ్లి చూపిస్తే చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు.          
     -అంపశయ్య నవీన్, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత  
     
     1953 నుంచి స్నేహితులం..
     1953 నుంచి నాగేశ్వర్‌రావుతో స్నేహం ఉంది. నేనంటే విపరీతమైన అభిమానం చూపించేవారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన ఆయన సహృదయులు కూడా. ముక్కుసూటి మనిషి. నిష్పక్షపాతంగా మాట్లాడేవారు. తనకు తెలియనివారు పలకరిస్తే తెలిసినట్లు నటించకుండా ఎవరు, ఏమిటని ఆరా తీసేవారు.
     - పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్  
     
     అక్కినేనితో 45 ఏళ్ల అనుబంధం..
     నా అభిమాన నటుడు ఏఎన్‌ఆర్ మృతిని తట్టుకోలేకపోతున్నా. ఉదయం నాలుగు గంటల కే బల్దియా ఉద్యోగి వచ్చి విషయం చెప్పగానే కూలబడిపోయాను. అక్కినేనితో నాకు 45 ఏళ్ల అనుబంధం ఉంది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లినప్పుడల్లా కిచెన్‌తో సహా మొత్తం తిప్పి చూపించేవారు. అలాగే, ఆయన సినిమాలు విడుదల కాగానే నా స్పందన ను లెటర్ ద్వారా తెలియజేస్తే మళ్లీ తిరుగు ఉత్తరం రాసేవారు. శ్రీవారి ముచ్చట్లు సినిమా లో సైడ్‌లాక్‌లు పెద్దగా ఉండడంతో బాగా లేదని చెప్పగా.. ఆ తర్వాత సాధారణంగా మార్చుకున్నారు. అప్పుడు ఎంతో సంతోషం కలిగింది. వరంగల్ నుంచి ఎవరైనా వెళ్లి కలిస్తే మాణిక్యం తెలుసా అని అడిగేవారు.  నన్ను మా ఇంట్లో వాళ్లందరూ ఏఎన్‌ఆర్ అనే పిలుస్తారు. ఆయనపై మూడు సావనీర్లు తీశాను.
     - పోలెపాక మాణిక్యం, ఏఎన్‌ఆర్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు  
     
     వనప్రేమికుడు అక్కినేని..
     డోర్నకల్, న్యూస్‌లైన్ :  
     అక్కినేని నాగేశ్వర్‌రావుకు మొక్కలు, చెట్లు, పూలంటే చాలా ఇష్టమని, వన ప్రేమికుడనే మాటకు ఆయన నిజమైన ఉదాహరణ అని ఖమ్మం జిల్లా గార్ల మండలం బుద్దారం గ్రామానికి చెందిన భాగం నాగార్జునచౌదరి తెలిపారు. డోర్నకల్ పక్కనే ఉన్న బుద్దారానికి చెందిన నాగార్జున ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టుడియోలో లైటింగ్ విభాగంలో మేనేజర్‌గా పనిచేస్తుండగా, ఆయన తండ్రి సూర్యనారాయణ నాగేశ్వర్‌రావు వద్ద గతంలో పనిచేశారు. సూర్యనారాయణ 1955లో తండ్రితో గొడవ పెట్టుకుని ఇంటి నుంచి మద్రాస్‌కు వెళ్లారు. అక్కడ అక్కినేనిని కలవగా తన ఇంట్లో పనికి పెట్టుకున్నారు. ఆ తర్వాత అక్కినేని కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి అన్నపూర్ణ స్టూడియోను స్థాపించగా, అందులో గార్డెన్ సూపర్‌వైజర్‌గా పనిచేశారు. నాగేశ్వర్‌రావు కుమారుడు, సినీ హీరో నాగార్జును పాఠశాలకు తీసుకువెళ్లడం, మధ్యాహ్నం భోజనం తినిపించడం వంటి పనులు కూడా సూర్యనారాయణ చేసేవారు. కొంతకాలానికి అక్కడ పనిమానేసి వచ్చిన ఆయన 1994లో తన కుమారుడు నాగార్జున చౌదరిని హీరో నాగార్జున వద్ద పనికి చేర్చారు. కాగా, సూర్యనారాయణ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఇదిలా ఉండగా అక్కినేని నాగేశ్వర్‌రావు కన్నుమూసిన నేపథ్యంలో నాగార్జున చౌదరి విలేకరులతో మాట్లాడుతూ తనతో పాటు తన తండ్రికి అక్కినేని కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని వివరించారు.
     

మరిన్ని వార్తలు