అత్యవసర సేవలకు ఆటంకం కలగనివ్వం

13 Aug, 2013 07:13 IST|Sakshi

 కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులందరూ మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తుండటంతో అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. సోమవారం తన చాంబర్‌లో కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ వైద్యం, డ్రింకింగ్, వాటర్, శానిటేషన్, విద్యుత్, తదితర అత్యవసర సర్వీసులకు ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సమ్మె నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని వివరించారు. ఉద్యోగులందరూ సమ్మెలోకి వెళుతున్నందున చేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె.మహంతి కొన్ని సూచనలు ఇచ్చారని వాటిని పాటిస్తున్నామని స్పష్టం చేశారు.
 
 ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసే వారి సేవలు వివిధ అవసరాలకు ఉపయోగించుకుంటున్నామన్నారు. అవసరమైతే రిటైర్డ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల(పబ్లిక్ సెక్టార్) ఉద్యోగులను కూడా వినియోగించుకుంటామని వివరించారు. సమ్మె కారణంగా అత్యవసర సేవలకు ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లుగా తెలిపారు.  శాంతి భద్రతలకు భంగం వాటిళ్లకుండా పోలీస్ యంత్రాంగానికి తగిన సూచనలు ఇచ్చినట్లు వివరించారు.
 

మరిన్ని వార్తలు