సేవలు బంద్ | Sakshi
Sakshi News home page

సేవలు బంద్

Published Tue, Aug 13 2013 6:58 AM

Services boycott


 కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర లక్ష్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సంఘాలు మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నాయి. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు. 52 ప్రభుత్వ 55వేల మంది సమ్మెలో పాల్గొననున్నారు. ఉపాధ్యాయులు 13, 14 తేదీల్లో మాస్ క్యాజువల్ లీవు పెట్టి ఉద్యమంలో పాల్గొంటారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నిరవధిక సమ్మెను పర్యవేక్షిస్తోంది. సమైక్యాంధ్ర సాధనకు చేపట్టనున్న సమ్మెలో గెజిటెడ్ అధికారులు కూడా పాల్పంచుకుంటున్నారు. కర్నూలులోని జనరల్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా మిగిలిన వాటన్నింటిని సమ్మె పరిధిలోకి తీసుకొచ్చారు. పశువైద్య సేవలు కూడా స్తంభించనున్నాయి.
 
  ఈ నెల 1వ తేదీ నుంచే ఉద్యోగులు విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొంటుండటంతో పాలన వ్యవహారాలు అస్తవ్యస్తమయ్యాయి. ఇక నిరవధిక సమ్మెతో పాలన సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. తాగునీరు, శానిటేషన్ వంటి అత్యవసర సేవలు కూడా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖల్లో వాణిజ్య పన్నుల శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, గనుల శాఖ ముఖ్యమైనవి. ఈ శాఖలు కూడా సమ్మెలోకి వస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడే ప్రమాదం ఏర్పడింది. నిరవధిక సమ్మెలో భాగంగా ప్రతిరోజు కలెక్టరేట్‌ల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోను ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఇళ్లను ముట్టడించి పరిసరాలను శుభ్రం చేయడానికి నిర్ణయించారు. సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు జిల్లా అధికారుల సంఘం నేతలు ఆనంద్‌నాయక్, వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమ్మెలో పాల్గొంటుండటంతో సేవలు స్తంభించనున్నాయి. వైద్యులు అత్యవసర సేవలకే పరిమితం కానున్నారు. అదేవిధంగా మూడు రోజుల పాటు పెట్రోల్ బంకులను స్వచ్ఛందంగా బంద్ చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
 
 సమ్మెకు సహకరించండి
 నిరవధిక సమ్మెకు సహకరించాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ వీసీహెచ్ వెంగల్‌రెడ్డి జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌కుమార్ సోమవారం రాత్రి కలెక్టర్‌ను కోరారు. జిల్లా అధికారులంతా సహకరించాలని విన్నవించారు. 108 సిబ్బంది కొంతకాలంగా సమ్మెలో ఉన్నందున పారామెడికల్ సిబ్బందిని ప్రత్యామ్నాయంగా వినియోగించుకుంటున్నారని.. వారు కూడా మంగళవారం నుంచి సమ్మెలో వెళ్తున్నారని కలెక్టర్‌కు తెలియజేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారన్నారు. జేఏసీ కార్యదర్శి శ్రీరాములు, నగర అధ్యక్షుడు లక్ష్మన్న, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు కలెక్టర్‌ను కలిశారు.
 

Advertisement
Advertisement