ఎన్నాళ్లీ వేదన!

17 Sep, 2019 08:57 IST|Sakshi
డెక్కపురం నుంచి విజయ్‌ను డోలీలో మోసుకొస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు

 ఏడు కిలోమీటర్ల దూరం డోలీలో ఇద్దరు రోగుల తరలింపు

మారుమూల గ్రామాలకు  రహదారి సౌకర్యం లేక అవస్థలు

సాక్షి, అనంతగిరి(అరకులోయ): ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు రహదారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో వైద్యసేవలు పొందడానికి గిరిజనులు కాలినడకన, లేదా డోలీల్లో ఆస్పత్రులకు చేరుకోవలసి వస్తోంది. ఆస్పత్రులకు చేరే వరకు వారి ప్రాణాలు నిలు స్తాయన్న నమ్మకం ఉండడం లేదు. ఇలా తరలించే సమయంలో  రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పాడేరు, అరకులోయ మండలాల్లో ఈ పరిస్థితి నిత్యం ఎదురవుతోంది.  ఒకే కుటుంబా నికి చెందిన, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు యువకులను కుటుంబ సభ్యులు ఏడు కిలోమీటర్లు డోలీలో తరలించవలసి వచ్చింది. అనంతగిరి మండలం అనంతగిరి పంచాయతీ డెక్కపురం, హుకుంపేట మండలం పట్కదవడ గ్రామాలు సమీపంలో పక్కపక్కన ఉన్నాయి. వీటికి  రహదారి సౌకర్యం లేదు.

డెక్కపురానికి చెందిన గెమ్మలి విజయ్‌ అనే యువకుడు కొద్దిరోజులుగా మతిస్థిమితం లేక బాధపడుతున్నాడు.  పట్కదవడ గ్రామానికి చెందిన  గెమ్మెలి చంటి అనే యువకుడికి గుండెనొప్పి వచ్చింది.  వీరి ఆరోగ్య పరిస్థితి సోమవారం క్షీణించింది. దీంతో  ఆ గ్రామాల నుంచి  ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీపురం వరకు వారిని రెండు డోలీల్లో దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా మోసుకొచ్చారు. అక్కడి నుంచి ఆటోలో అనంతగిరి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవల కోసం చంటిని  అరకులోయ ఏరియా ఆస్పత్రికి,  విజయ్‌ను కేజీహెచ్‌కు తరలించారు. తాము ఈ బాధలు భరించలేకపోతున్నామని, అధికారులు స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని ఆ రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు