ప్లాట్లు ఇస్తామంటూ మోసం

17 Sep, 2019 09:07 IST|Sakshi

‘గ్లోబల్‌ టార్జ్‌ ప్రైడ్‌’ నిర్వాకం

రూ. కోట్లల్లో టోకరా

సంస్థ కార్యాలయంలో బాధితుల ఆందోళన

హిమాయత్‌నగర్‌: ప్లాట్లు ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సోమవారం రాత్రి హియాయత్‌ నగర్‌లోని ‘గ్లోబల్‌ టార్జ్‌ ప్రైడ్‌’ సంస్థ కార్యాలయంలో 100 మందికి పైగా బాధితులు ఆందోళన చేపట్టారు. దీనిపై సమాచారం అందడంతో నారాయణ గూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

కూతురి పెళ్లి ఆగిపోయింది
లక్కీ డ్రా ద్వారా బహుమతి వచ్చిందంటే నమ్మి వెళ్లాం. నగర శివారు ప్రాంతాల్లో ప్లాట్లు తక్కువ ధరకే ఇస్తామంటే ఆశపడి లక్షల్లో డబ్బులు చెల్లించాం, ఈరోజు, రేపు అంటూ మోసం చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వలేదు. డబ్బులు లేక నా కూతురి పెళ్లి ఆగిపోయింది.  –భాగ్యలక్ష్మి,  సికింద్రాబాద్‌

రూ.3 లక్షలు కట్టాను
తక్కువ ధరకే ప్లాట్‌ ఇస్తామంటే ఆశ పడ్డాను, అప్పుచేసి రూ.3 లక్షలు కట్టాను. ఇప్పుడు తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేదు. అప్పుల వాళ్ళు ఇంటిమీదకొస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు.
–సరిత, సంతోష్‌నగర్‌.

గిప్ట్‌ వచ్చిందని ముంచారు..
గిప్ట్‌ వచ్చిందంటూ ఫోన్‌ రావడంతో అబిడ్స్‌ వెళ్లాం. నగర శివార్లలో మంచి ఫ్లాట్‌ చూపించి రూ.2 లక్షలు కట్టమంటే కట్టాం, ఏడాదిన్నర అవుతున్నా ప్లాటు లేదు , డబ్బు ఇ్వమంటే స్పందన లేదు, నా కూతురుకు మొహం చూపలేకపోతున్నా. నాకు న్యాయం చేయాలి. –రాజేశ్వరి, ఉప్పల్‌

మరిన్ని వార్తలు