గ్రీవెన్స్.. నాన్సెన్స్!

26 Jan, 2014 23:57 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సామాన్యుని సమస్యలకు పరిష్కారమే అంతిమ లక్ష్యంగా ఏర్పాటుచేసిన ‘ప్రజావాణి’ జిల్లాలో గాడి తప్పింది. గ్రీవెన్స్‌ను జిల్లా అధికారులు మొక్కుబడి కార్యక్రమంగా మార్చేశారు. ఫిర్యాదుదారుని నుంచి అర్జీ తీసుకుని 30 రోజుల పాటు నాన్చడం.. ఆ తర్వాత ‘మీ సమస్య పరిష్కరించడమైనది’ అని కలెక్టర్ కార్యాలయం నుంచి ఓ ఉత్తరం పంపి చేతులు దులుపుకుంటున్నారు.

 కానీ పరిష్కరించారో లేదో తెలియక ఫిర్యాదుదారులు తలపట్టుకుంటున్నారు. అయినా ఆశ చావని ముసలవ్వలు కళ్లు కనిపించకపోయినా కట్టె పొడుచుకుంటూ... కట్టుకున్నవాడు కాలంజేస్తే సంసారాన్ని మోయలేని వితంతువులు... కంపెనీల కాలుష్యపు కోరలకు చిక్కి తల్లడిల్లుతున్న జనం... రేషన్ కార్డని.. కొత్త ఇళ్లని.. ఫీజు రీయింబర్స్‌మెంటని ఇలా జనాలు ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీసు మెట్లెక్కుతున్నారు. కష్టనష్టాల కోర్చి ప్రజలు చేస్తున్న ఫిర్యాదులపై అధికారుల పని తీరును పరిశీలించేందుకు ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రజలను నేరుగా కలిసి మాట్లాడినపుడు  ‘ప్రజావాణి’ డొల్లతనం బయటపడింది.

 చిన్నచిన్న సమస్యలను కూడా పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నట్లు కనిపించింది. మండలాల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు సంగారెడ్డికి పంపితే జిల్లాఅధికారులు మళ్లీ మండలానికే పంపిస్తున్నారు. మండలస్థాయి అధికారులు సమస్యలను పరిష్కరించలేక, పెండింగ్‌లో ఉంచలేక డిస్పోజ్డ్ అని చూపిస్తున్నారు. కాలంతీరిన ఫిర్యాదులను పరిష్కరించిన జాబితాలో చేర్చి జిల్లా కలెక్టర్‌ను, ప్రజలను మోసం చేస్తున్నట్టు తేలింది. అధికారులు పరిష్కరించినట్లు చూపిస్తున్నవి కాకి లెక్కలే అని బయటపడింది.

 గడిచిన మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటివరకు 15,502 ఫిర్యాదులు రాగా వాటిలో 14,730 కేసులు పరిష్కరించినట్లు అధికారిక నివేదికలు చెప్తున్నాయి. మిగిలిన 772 ఫిర్యాదులు కూడా కోర్టు కేసులు, ఇతర వివాదాలు ఉండటం వల్లే పరిష్కరించలేకపోయామని నివేదికల్లో పొందుపరిచారు. గత ఏడాది మొత్తం 9,568 ఫిర్యాదులు అందగా 9,095 కేసులు పరిష్కరించినట్లు చూపించారు.

  దుబ్బాక మండలం దుంపలపల్లికి చెందిన కె. లింగమ్మ గత ఏడాది నవంబర్ 11 గ్రీవెన్స్‌కు అర్జీ పెట్టుకున్నారు. తన బావ ప్రభాకర్ అనే వికలాంగుని పేరు మీద 148/9లో ఎకరం భూమి ఉంది. భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు, రెవెన్యూ రికార్డుల్లో ప్రభాకర్ పేరే ఉంది. కబ్జాలో మాత్రం మరో వ్యక్తి ఉన్నారు. తన భూమి తనకు ఇప్పించాలని విన్నవించారు. ఆమెకు 148/9 సర్వే నంబర్ భూమిలో మోఖా ఇవ్వకుండానే అదే ఏడాది డిసెంబర్ 9న ఫిర్యాదు పరిష్కరించినట్టు కలెక్టర్ కార్యాలయం నుంచి ఆమెకు లేఖ అందింది. పైగా వేరొకరు కబ్జాలో ఉన్నారు కాబట్టి పొజిషన్ ఇవ్వలేమని చెప్పి చేతులు దులిపేసుకున్నారు.

అధికారుల సమాధానంతో అవాక్కైన లింగమ్మ మళ్లీ గ్రీవెన్స్‌కు వచ్చి మరో అర్జీ పెట్టుకున్నారు.
  పుల్కల్ మండలం వెండికోల్ గ్రామానికి చెందిన తిరుపతి అనే రైతుకు ఓ రెవెన్యూ అధికారి నకిలీ 13బీ సర్టిఫికెట్, నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి మోసం చేశారు. సదరు అధికారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని గత ఏడాది డిసెంబర్ 2న గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు సదరు అధికారి మీద చర్యలు లేవు, ఆయనకు న్యాయం జరగలేదు, కానీ సమస్య పరిష్కరించినట్టు ఈ నెల 2వ తేదీన తిరుపతికి లెటర్ అందింది.

  జిన్నారం మండలం కిష్టాయిపల్లి 166/2అ సర్వే నంబర్‌లో పుల్లంగారి ఎల్లమ్మ, ఆమె బావ ఎంకయ్యలకు 3.24 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూమి పక్కనే ఓ వెంచర్‌ను నిర్మాణం చేస్తున్నారు. ఈ వెంచర్ యాజమాన్యం కొంతమేరకు ఎంకయ్య, ఎల్లమ్మల భూమిలోకి చొచ్చుకొచ్చారు. సర్వే చేసి తమ భూమిని కాపాడాలని వారు మండల గ్రీవెన్స్‌లో 2012లో ఫిర్యాదు చేశారు. 2014లో జిల్లా గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు స్పందించలేదు.

  గిరిజనులకు గుక్కెడు నీళ్లు కూడా ‘ప్రజావాణి’ ఇవ్వలేకపోయింది. కాంజీపురం, కొత్తపల్లి, చౌహాన్‌వాడి తండాలకు చెందిన గిరిజనులు తాగునీటి సమస్యను తీర్చాలని 30 రోజుల కిందట కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌డేలో ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. తండాలో రెండు బోర్లుండగా... ఒక బోరు నుంచి ఫ్లోరైడ్ నీరు వస్తోంది. మరో బోరు చెడిపోయింది. చెడిపోయిన బోరుకు మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వస్తుంది. అధికారులు కనీసం ఆ పని కూడా చేయలేదు. తాగునీటి కోసం ఇక్కడి మహిళలు దాదాపు కిలోమీటర్ నడిచి వ్యవసాయ బావుల నుంచి తెచ్చుకుంటున్నారు.

  కోహీర్ పట్టణ ంలోని మొల్లవాడికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త నియామకంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మంగలి స్వరూప అనే మహిళ ఈ నెల 6న కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. బీసీ(డీ) గ్రూపునకు చెందిన మహిళకు బీసీ(ఎ) కుల ధ్రువీకరణ పత్రం కింద అంగన్‌వాడీ కార్యకర్తగా అవకాశం ఇచ్చారని ఆరోపిస్తూ స్వరూప ఫిర్యాదు చేశారు. దరఖాస్తు ఇచ్చి 17 రోజులవుతున్నా ఇప్పటివరకు సరైన సమాధానం ఇవ్వలేదు. కులధ్రువీకణ పత్రం విచారణ నిమిత్తం కలెక్టర్ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని కోహీర్ తహశీల్దార్ చెప్పారు.

  తూప్రాన్ మండలం రంగాయిపల్లి గ్రామస్థులను స్పాంజ్ అండ్ ఐరన్ కంపెనీ కాలుష్య భూతం పట్టింది. ఈ కంపెనీ కాలుష్యం దెబ్బకు సమీప పల్లెలు అల్లకల్లోలమవుతున్నాయి. పసిపిల్లలు ఆరోగ్యంగా ఎదగటం లేదు. పచ్చని పంట పొలాలు బీడు భూములుగా మారిపోయాయి. పరిశ్రమ సమీపంలోని కిలోమీటరు దూరంలో ఉన్న భూగర్భ జలాలు సైతం కలుషితమయ్యాయి. దీంతో ప్రజలు తాగేందుకు నీరు దొరకక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

ఈ కలుషిత నీటితో స్నానాలు చేస్తే వంటిపై దద్దుర్లు వస్తున్నాయి. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ గత డిసెంబరు 16న గ్రామానికి చెందిన నవచైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్‌కు గ్రీవేన్స్ డే సందర్భంగా ఫిర్యాదు చేశారు. రోజులు గడిచాయి కానీ అధికారుల జాడ లేదు. సమస్యకు పరిష్కారం చూపలేదు.

  వర్గల్ మండలం తున్కిఖల్సా గ్రామం సమీపంలో సామ్రాట్ టైర్ల పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమలో పాత టైర్లను కాల్చి నూనె, ఐరన్, బూడిద తీస్తారు. గతంలో ఉన్న తహశీల్దారు ఏదీ చూడకుండానే నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిశ్రమ నుంచి వచ్చిన కాలుష్యంతో తున్కిఖల్సా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యం సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు గ్రీవెన్స్‌ను ఆశ్రయించారు.

 అయినా పరిస్థితి ఇప్పటికీ యథాతథం. పరిశ్రమ నిర్వాహకులు కాలుష్యం పొగను రాత్రి వేళ విడుదల చేస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయినా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం చోద్యం చూడటం గమనార్హం. పరిశ్రమ నుంచి వచ్చే వాసన భరించలేక సమీప పంట పొలాల్లో పనిచేయడానికి కూలీలు కూడా రాని పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు