భవిత.. భరోసా

11 Jan, 2020 11:07 IST|Sakshi
ఏపీ మోడల్‌ స్కూల్‌

ఏపీ మోడల్‌ స్కూల్‌ల్లోప్రవేశానికి నోటిఫికేషన్‌

దరఖాస్తుకు ఫిబ్రవరి 7 తుది గడువు

ఏప్రిల్‌ 5న ప్రవేశ పరీక్ష

వైఎస్‌ఆర్‌ జిల్లా,వల్లూరు: ప్రస్తుత సమాజంలో చదువుకు విలువ పెరిగింది. జీవితంలో చదువు ఎంత అవసరమైనదో ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. పేద, ధనిక వర్గాలకు అతీతంగా తమ పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము తిన్నా తినకపోయినా తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పిల్లలను ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో చేర్చడానికి ఉత్సాహం చూపుతున్నారు.

పేదలకు ఆసరాగా మోడల్‌ స్కూల్స్‌ :కార్పొరేట్‌ చదువులు సామాన్య, మధ్య తరగతి వర్గాల నడ్డి విరుస్తున్న తరుణంలో 2013– 14 విద్యా సంవత్సరం నుంచి  ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ మోడల్‌ స్కూల్స్‌ విద్యార్థుల పాలిట వరంగా మారాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 6 వతరగతి నుంచి ఇంటర్‌ వరకు ఇంగ్లిష్‌ మీడియంలో కార్పొరేట్‌ స్థాయి సౌకర్యాలతో విద్యను అందించడమే ధ్యేయంగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అన్ని వర్గాల వారికి నాణ్యమైన ఇంగ్లిష్‌ మీడియం విద్యను అందించడంలో ఆదర్శంగా నిలుస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నాయి.

ప్రవేశానికి పోటీ తీవ్రం  
మోడల్‌ స్కూళ్లలో ప్రవేశం పొందడానికి పోటీ తీవ్రంగా ఉంది.  దీనికి తోడు కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా వివిధ సౌకర్యాలతోపాటు, సుశిక్షితులైన ఉపా««ధ్యాయులు అందుబాటులో ఉండడంతో ఈ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతున్నారు. ఇక్కడ సీటు సాధించడానికి ముందుగానే తర్ఫీదు ఇచ్చి పిల్లలను సిద్ధం చేస్తున్నారు. 

దరఖాస్తుకు తుది గడువు ఫిబ్రవరి 7 :2020– 21 విద్యా సంవత్సరంలో  6 వ తరగతిలో ప్రవేశానికి  నిర్వహించే ప్రవేశ పరీక్షకు  జనవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

దరఖాస్తు చేయడం ఇలా..
ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రూ.50 లను ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్న వారు నెట్‌ బ్యాంకింగ్‌ లేక క్రెడిట్‌ కార్డు లేక డెబిట్‌ కార్డులను ఉపయోగించి గేట్‌వే ద్వారా ఫీజు చెల్లిస్తే వారికి ఒక జనరల్‌ నంబరును కేటాయిస్తారు. ఆ నంబర్‌ ఆధారంగా ఏదైనా ఇంటర్‌ నెట్‌ సెంటర్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తును చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఆయా కేంద్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌ 5 వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రతిభను అనుసరించి రిజర్వేషన్‌ మేరకు సీట్లను కేటాయిస్తారు. 

పరీక్ష విధానం ఇలా..
దరఖాస్తు చేసుకున్న వారికి ఇంగ్లిషు, తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులలో ఒక్కో దానిలో 25 మార్కుల చొప్పున 100 మార్కులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిషు మీడియంలో 5 వ తరగతి స్థాయిలో ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది.  ఓసీ, బీసీలు కనీసం 35 మార్కులు, ఎస్సీ , ఎస్టీలు కనీసం 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

జిల్లాలోని ఏపీ మోడల్‌ స్కూళ్లవే..
వల్లూరు, ఖాజీపేట, కాశినాయన, పుల్లంపేట, పెనగలూరు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, సంబేపల్లె, చిన్నమండెంలలో ఏపీ మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి.

అర్హతలు ఇవే ..
6వ తరగతిలో ప్రవేశం పొందడానికి
2008 సెప్టెంబర్‌ 01 నుంచి 2010 ఆగస్టు 31 మధ్యన జన్మించిన ఓసీ, బీసీ విద్యార్థులు, 01– 09–2006 సెప్టెంబర్‌ 01 నుంచి 2010 ఆగస్టు 31 మధ్య జన్మించిన ఎస్సీ , ఎస్టీ విద్యార్థులు అర్హులు.
వీరు జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2018– 19, 2019– 20 విద్యా సంవత్సరాల్లో నిరంతరాయంగా చదువుతూ వచ్చే విద్యా సంవత్సరానికి ఆరవతరగతికి ప్రమోషన్‌ కల్పించడానికిఅర్హత కలిగి ఉండాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవాలి
ఏపీ మోడల్‌ స్కూళ్లలో ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్‌ విడుదలైంది.  ఫిబ్రవరి 7వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా నిబంధనలను అనుసరించి సీట్లు కేటాయిస్తాం.  – దిలీప్‌ కుమార్,    ప్రిన్సిపల్, ఏపీ మోడల్‌ స్కూల్‌

మరిన్ని వార్తలు