శ్రీమంతులు వస్తున్నారు

20 Apr, 2016 23:59 IST|Sakshi

  జిల్లా అభివద్ధికి తోడ్పాటునిస్తామంటున్న ఎన్‌ఆర్‌ఐలు
 జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించిన ప్రతినిధులు
 ప్రణాళిక సిద్ధం చేస్తే నిధులిస్తామని వెల్లడి
 ఐదు అంశాలకు ప్రాధాన్యమిస్తామని స్పష్టీకరణ
 అంశాల వారీగా నివేదిక తయారీలో అధికారులు

 
 రహదారి సౌకర్యానికి నోచుకోని పల్లెలు... తాగునీటికి తహతహలాడే ప్రాంతాలు... అత్యవసర వేళ సైతం ఆమడదూరం వెళ్లాల్సిన పరిస్థితులు... ప్రాణంపోతే ఖననానికి ఆరడుగుల స్థలంకోసం ఆరాటపడే గ్రామాలు... ఇలాంటి సమస్యలు జిల్లాలో కోకొల్లలు. సర్కారు నిధులకోసం ఎదురుచూసినా అది అత్యాశగానే మారిపోతోంది. దేవరకొండను తలపించే ఈ పల్లెలను ఆదుకునేదెవ్వరు? అనుకుంటున్న తరుణంలో ప్రవాసభారతీయుల మనసు కరిగి అభివద్ధి చేసేందుకు సమాయత్తమయ్యారు. ప్రధాన సమస్యల పరిష్కారానికి నిధులిస్తామంటూ ముందుకొచ్చారు.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో సమస్యలు తాండవిస్తున్నాయి. మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. వాటిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపైసా కూడా విదల్చట్లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే వాటిని తమ ఘనతగా చెప్పుకుని రకరకాల పేర్లతో ఏవో అరకొర పనులు చేయిస్తున్నారు. పల్లెల్లో చంద్రన్న బాట పేరుతో వేస్తున్న సిమెంట్‌రోడ్లు... ఎన్టీఆర్ జలసిరి... ఎన్టీఆర్ గహపథకం ఇవన్నీ ఆ కోవలోకే వస్తాయి. అవీ నిజమైన అర్హులకు అందనివ్వకుండా... ఎన్నాళ్లుగానో పార్టీని నమ్ముకున్న తమ్ముళ్లకు ప్రోత్సాహకరంగా ఉండేలా అందజేస్తున్నారు.
 
  దీనివల్ల అభివద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. వెనకబడిన జిల్లా ఇక అభివద్ధి బాట పట్టే మార్గమేంటనే ఆందోళన అందరిలోనూ వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మేమున్నామంటూ నార్త్ అమెరికా ఎన్‌ఆర్‌ఐలు ముందుకొచ్చారు. ప్రాధాన్యత అంశాల వారీగా ప్రణాళిక రూపొందించి తమకు పంపిస్తే నిధులిస్తామంటూ నార్త్ అమెరికాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రముఖుల తరఫున కోమటి జయరామ్ అనే వ్యక్తి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఎన్‌ఆర్‌ఐలు కోరిన ప్రాధాన్యత అంశాల పరిస్థితి ఇలా ఉంది.
 
 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం
 జిల్లాలో మరుగుదొడ్లు లేని ఇళ్లు 3,01,458 వరకు ఉన్నాయి. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో 94,442ఇళ్లకు మరుగుదొడ్లు మంజూరు చేశారు. అయితే రెండేళ్లు కావస్తున్నా 15వేలు కూడా అందులో పూర్తి కాలేదు. తాజాగా బహిరంగ మల విసర్జన జరుగుతున్న గ్రామాలకు మాత్రమే వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ లెక్కన మరో 2లక్షల 80వేల ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పుడీ ప్రణాళిక తయారు చేసి ఇచ్చినట్టయితే ఎన్‌ఆర్‌ఐలు నిధులిచ్చి నిర్మించనున్నారు. అలాగే, ప్రతీ పాఠశాలకు పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు నిర్మించేందుకు కూడా వారు ఆసక్తి చూపుతున్నారు.
 
 మినరల్ వాటర్ ప్లాంట్లకు సాయం
 జిల్లాలో 921పంచాయతీలు ఉన్నాయి. 4లక్షల 63వేల 520ఇళ్లు ఉన్నాయి. 19లక్షల 65వేల వరకు గ్రామీణ జనాభా ఉంది. కానీ, దాతల సాయంతో స్వచ్ఛమైన మినరల్ వాటర్ ఇచ్చేందుకు కేవలం తొమ్మిది ప్లాంట్లను మాత్రమే ఏర్పాటు చేశారు. ఇందులో రెండు ఇప్పటికే మూతపడ్డాయి. వాస్తవానికైతే పంచాయతీకొకటి చొప్పున ఏర్పాటు చేయాలి. కానీ సురక్షిత మంచినీరు అందక ప్రజలు అల్లాడిపోతున్నారు. స్వచ్ఛమైన నీరు దొరకక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పుడీ అవస్థలు తీర్చేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు నార్త్ అమెరికా ఎన్‌ఆర్‌ఐలు చొరవ చూపుతున్నారు.
 
 పాఠశాలలకు మౌలిక సదుపాయాలు
 జిల్లాలో 2900పాఠశాలలు ఉన్నాయి. సగానికిపైగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్యలు వెంటాడుతున్నాయి. దాదాపు 700పాఠశాలలకు అదనపు గదుల సమస్య ఉంది. తాగునీరు, బెంచీలు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్‌ఆర్‌ఐలు సహకరిస్తే ఇప్పుడా సమస్యలు పరిష్కారమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రతీ గ్రామంలో శ్మశాన వాటికలు ఉన్నాయి. అత్యధిక చోట్ల నీటి సమస్య ఉంది. రహదారుల్లేని పరిస్థితులు ఉన్నాయి. వీటిని కూడా పరిష్కరించేందుకు ఎన్‌ఆర్‌ఐలు చొరవ చూపుతున్నారు. ఇప్పుడు అధికారులు ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నారు. ఇవి త్వరితగతిన పూర్తయితే జిల్లాకు కొంతయినా ఊరటకలిగే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు