హత్యకేసులో నిందితుడి అరెస్టు

23 Aug, 2013 05:43 IST|Sakshi
ఏటీ అగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: పట్టపగలు నడిరోడ్డుపై వ్యక్తిని కత్తితో పొడిచి హతమార్చిన నిందితుడిని నగరంపాలెం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ జెట్టి గోపినాథ్ నిందితుడి వివరాలను వెల్లడించారు. గుంటూరు కె.వి.పి.కాలనీలోని యతిరాజునగర్‌లో దాసరి ఆంజనేయులు అలియాస్ బబ్బూలు, అతని ఇంటి పక్కనే కొలగాని సుబ్బారావు నివాసం ఉంటున్నారు. ఇరు కుటుంబాల వారు స్నేహంగా ఉంటుండేవారు. 2011 సెప్టెంబరు 23న కేవీపీ కాలనీలో మద్యం సేవించి ఆంజనేయులు రోడ్డుపక్కన పడి ఉన్నాడు. అతని జేబులో డబ్బును సుబ్బారావు దొంగిలించాడనే అనుమానంతో ఇరు కుటుంబాల వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 
 
 నగరంపాలెం పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అనంతరం సుబ్బారావు పాతగుంటూరులోని సుద్దపల్లి డొంకకు మకాం మార్చాడు. మూడు నెలల క్రితం ఆంజనేయులు నాజ్‌సెంటర్‌లో సుబ్బారావు సంచరిస్తుండడాన్ని గుర్తించాడు. ఆంజనేయులుతోపాటు తన స్నేహితులు ఐదుగురు జేబు దొంగల సహకారంతో సుబ్బారావుపై దాడి చేసి గాయపరిచాడు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని  హెచ్చరించడంతో ప్రైవేటు వైద్యశాలలో సుబ్బారావు చికిత్స చేయించుకున్నాడు. రెండు వారాల క్రితం మళ్లీ ఆంజనేయులు మార్కెట్ సెంటర్‌లో సుబ్బారావును అటకాయించి కత్తితో దాడి చేశాడు. ఇక తనను అంతమొందిస్తాడని భావించిన సుబ్బారావు, ఆంజనేయులును హత్య చేయాలని నిర్ధారించుకున్నాడు. ఈనెల 19వ తేదీన మస్తాన్‌దర్గా సమీపంలో ఉన్న ఆంజనేయులుపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. 
 
 మృతిచెందాడని నిర్ధారించుకున్న అనంతరం  పరారయ్యాడు. గురువారం ఉదయం సుబ్బారావు సుద్దపల్లి డొంక సెంటర్‌లో ఉన్నట్లు తెలిసి సీఐ సి.హెచ్.శ్రీనివాసరావు, సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. తనపై రెండు విడతలుగా హత్యాయత్నం చేయడంవల్లే తాను హత్య చేయాల్సి వచ్చిందని నిందితుడు తెలిపాడు. హత్యకు పాల్పడినట్లు అంగీకరించడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని వివరించారు. సమావేశంలో వెస్ట్ డీఎస్పీ సి.హెచ్.వెంకటేశ్వరరావు, సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం,  పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు