బాబుగారొస్తారని..

29 Aug, 2018 13:42 IST|Sakshi
మల్లవరంలో సీఎం పర్యటన ఏర్పాట్ల పనులను పర్యవేక్షిస్తున్న సబ్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ

మల్లవరంలో 20 రోజులుగా అధికారుల తిష్ట

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో బిజీబిజీ

రాజమహేంద్రవరం డివిజన్‌అధికారులందరూ అక్కడే..

ఇతర ప్రాంతాల పారిశుద్ధ్య కార్మికులు, ట్రాక్టర్ల తరలింపు

గ్రామంలో హడావుడి చూసి అవాక్కవుతున్న గ్రామస్తులు  

సాక్షి, తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం: పదుల సంఖ్యలో అధికారులు.. సబ్‌ కలెక్టర్‌ నుంచి తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్‌ఐలు.. డివిజనల్‌ పంచాయతీ అధికారి, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, వందల సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు.. గత 20 రోజులుగా గోకవరం మండలం మల్లవరం గ్రామంలో తిష్ట వేశారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం వీరందరూ నానా హైరానా పడుతున్నారు. నాలుగేళ్లుగా లేనిది ఆ గ్రామంలో రోడ్లు వేసేస్తున్నారు. వేసిన రోడ్లకు రంగులేసేస్తున్నారు. మార్కింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. ఎప్పుడూ తమ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడని పెద్దపెద్ద అధికారులు ఇలా ఇన్ని రోజులపాటు తమ గ్రామంలో ఉండడం చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తమ గ్రామ స్వరూపం మారిపోతుందని అనుకుంటున్నా.. చేస్తున్న పనులన్నీ ఆ గ్రామంలోని సమస్యలు ముఖ్యమంత్రి కంట పడకుండా ఉండేందుకేనన్నట్టుగా ఉన్నాయంటూ గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇక్కడి సిబ్బంది అక్కడ..
గ్రామంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించేం దుకు రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌లోని అధికారులకు మల్లవరంలో డ్యూటీ వేశారు. సబ్‌ కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ ప్రతి రోజూ ఆ గ్రామానికి వెళ్లి పనులు జరుగుతున్న తీరు తెలుసుకుంటుండగా, ఇతర అధికారులు అక్కడే ఉండి పనులు చేయిస్తున్నారు. రాజమహేంద్రవరం డివిజన్‌లోని పలు మండలాల నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలను మల్లవరం పంపడంతో, వివిధ పనుల కోసం ఆయా కార్యాలయాలకు వెళ్తున్న ప్రజలు అధికారులు లేక ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. అధికారులు ఎక్కువ సమయం మల్లవరంలో ఉంటుండడంతో కార్యాలయాల్లో రోజువారీ పనులు స్తంభించిపోతున్నాయి. దాదాపు 7 వేల మంది ఉన్న మల్లవరం గ్రామానికి రాజమహేంద్రవరం డివిజన్‌లోని గ్రామాల నుంచి 120 మంది పారిశుద్ధ్య కార్మికులను ట్రాక్టర్లతో సహా తరలించారు. ఐదు రోజులుగా మల్లవరంలో 120 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. మల్లవరంలో పరిస్థితి అలా ఉండగా, ఆ 120 మంది కార్మికులు వాస్తవంగా విధులు నిర్వహించాల్సిన గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. సీఎం పర్యటన అనంతరం, ఆ కార్మికులు తాము పని చేస్తున్న ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోతే, మల్లవరంలో పారిశుధ్య పనులు ఎవరు చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యమంత్రి పర్యటన కోసం హడావుడి చేయడం కాకుండా, తమ గ్రామంలో శాశ్వతంగా కార్మికులను నియమించి పారిశుధ్య పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

లక్ష్యం మరచి సుందరీకరణ
గ్రామదర్శిని, నగర దర్శిని పేర్లతో గ్రామాలు, పట్టణాలల్లో పారిశుధ్య సమస్యలు, ప్రజల ఇక్కట్లు, స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలి. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకొని ప్రజలతో నేరుగా మమేకమై పరిష్కరించాలి. కానీ గ్రామదర్శిని పేరుతో ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమం అసలు లక్ష్యాన్ని పక్కదోవ పట్టించేవిధంగా ఉంది. సీఎం పర్యటనకు పక్షం రోజుల ముందే అధికారులు అక్కడ అభివృద్ధి పనులు చేయడం, రోడ్లు, గోడలకు రంగులు వేయడం, మొక్కలు నాటడం, డ్రైనేజీ, పారిశుధ్య పనులు చేపట్టడం చేస్తున్నారు. తద్వారా దీర్ఘకాలంగా గ్రామంలో తిష్ట వేసిన సమస్యలు సీఎంకు కనపడనీయకుండా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి

మరిన్ని వార్తలు