అట్రాసిటీ చట్టంపై ఆర్డినెన్స్‌ 

6 Jun, 2018 13:58 IST|Sakshi
 కేంద్ర మంత్రిని సన్మానిస్తున్న  పద్మజారెడ్డి తదితరులు   

కేంద్ర మంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్‌ 

 మోదీ పాలనలో జీడీపీ పెరుగుదల  

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిచాల్సిన అవసరం లేదని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్‌ పేర్కొన్నారు. అట్రాసిటీ చట్టంపై సుప్రీం కోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం ద్వారా రివ్యూ పిటివేషన్‌ వేశామని, ఒకవేళ తీర్పు అనుకూలంగా రాకపోతే అట్రాసిటీ చట్టంపై ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి యథాతధ స్థితిలో ఉంచుతామన్నారు. ఈ విషయంలో ఎస్సీ, ఎస్టీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. ఆ తర్వాత బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యూపీఏ హయాంలో 4.4 శాతం ఉన్న జీడీపీ... ప్రస్తుతం నరేంద్రమోదీ పాలనలో 7.7 శాతానికి పెరిగినట్లు తెలిపారు. మోదీ నాలుగేళ్ల పాలనలో దేశంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. 2020 వరకు దేశంలోని ప్రతీ నిరుపేదకు సొంత ఇళ్లు నిర్మించాలన్నదే ప్రధాని ధ్యేయమని అన్నారు. జన్‌ధన్‌ యోజనతో 32 కోట్ల కుటుంబాలకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు తెరవడం జరిగిందన్నారు. ఇటీవలే జరిగిన పలు సర్వేల్లో నరేంద్రమోదీపై 65 శాతం నుంచి 70 శాతం ప్రజలు అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో బీజేపీ అనుకూలమైన వాతావరణం ఉందని గెహ్లాట్‌ వ్యాఖ్యానించారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, త్వరలో జరగనున్న రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు