పంచాయతీ కార్యదర్శుల భర్తీకి బ్రేక్

29 Nov, 2013 02:44 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ ప్రక్రియ కోర్టు ఉత్తర్వులతో తాత్కాలికంగా నిలిచిపోయింది. కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న 90 మంది ఈ నెల 25న ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు భర్తీ ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా ట్రిబ్యునల్ స్టేటస్‌కో ఉత్తర్వు జారీ చేసింది. దీంతో కోర్టు తీర్పు తర్వాతే పోస్టులు భర్తీ చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి పి.ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీపై గంపెడాశతో దరఖాస్తు చేసుకున్న వేలాది మంది అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న షెడ్యూలు ప్రకారం ఈ నెల 28న అధికారులు అర్హుల జాబితాను వెలువరించాల్సి ఉంది.

కోర్టు తీర్పు నేపథ్యంలో భర్తీ ప్రక్రియ ఇప్పట్లో కొలిక్కి వచ్చే సూచన కనిపించడం లేదు. జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్-4 పోస్టుల భర్తీకి కలెక్టర్(పంచాయతీ వింగ్) కార్యాలయం అక్టోబర్ 31న నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 210 పోస్టులకు  15,434 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్యదర్శులకు గరిష్టంగా 25 మార్కులకు వెయిటేజీ ఇస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జిల్లాలో 205 మంది కాంట్రాక్టు పద్ధతిలో కార్యదర్శులుగా పనిచేస్తుండగా, వీరిలో కొందరు 2003, మరికొందరు 2006 నుంచి పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేసిన తర్వాతే మిగతా పోస్టులు భర్తీ చేయాలనేది వీరి డిమాండు. వీరి డిమాండును పరిగణనలోకి తీసుకుంటే కేవలం ఐదు పోస్టులు మాత్రమే ఇతరులకు అందుబాటులో ఉంటాయి.
 పూర్తికాని కసరత్తు
 నోటిఫికేషన్ షెడ్యూలు ప్రకారం ఈ నెల 28 వరకే అర్హుల జాబితాను తయారు చేసి, 29న నియామక పత్రాలు అందజేయాల్సి ఉంది. అయితే కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు అందడంతో అధికారులు కేవలం వివరాలను కంప్యూటరీకరించగలిగారు. వెయిటేజీ, రోస్టర్ తదితర అంశాలపై ఇంకా కసరత్తు చేసి తుది జాబితా సిద్ధం చేయాల్సి ఉంది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో భర్తీ ప్రక్రియ కసరత్తును అధికారులు తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు