పంచాయతీ @ ఆన్‌లైన్

20 Jun, 2014 01:20 IST|Sakshi
పంచాయతీ @ ఆన్‌లైన్

విశాఖ రూరల్ : జిల్లాలో 925 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం కార్యకలాపాలన్నీ పేపర్లు, రికార్డులు ఆధారంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో ఎక్కడెక్కడ ఎంత వ్యయం జరిగింది, చేపట్టిన కార్యక్రమాలను వెంటనే తెలుసుకొనే అవకాశం లేకుండా ఉంది. అలాగే ప్రజలకు అవసరమైన సేవలకు కూడా తాత్సారం జరుగుతోంది.

ఇటువంటి ఇబ్బందులను అధిగమించడంతో పాటు ఆన్‌లైన్ ద్వారా ఎక్కడ నుంచైనా పంచాయతీ కార్యకలాపాలను సులువుగా తెలుసుకొనేందుకు వీలుగా కంప్యూటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన వనరులకు నిధులు మంజూరు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి కాని పక్షంలో మున్ముందు 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసేది లేదని ఆంక్షలు విధించింది. అయితే బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి ఇంటర్నెట్ మోడంలు రాకపోవడంతో ఈ ప్రక్రియకు జాప్యం జరుగుతోంది.
 
150 కంప్యూటర్లు సిద్ధం : తొలి దశలో జిల్లాకు 150 కంప్యూటర్లను మంజూరు చేశారు. జిల్లాలో ఉన్న 925 పంచాయతీలను 565 కస్టర్లుగా విభజించారు. దీని ప్రకారం ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో కంప్యూటర్‌ను కేటాయించనున్నారు. అలాగే ప్రస్తుతానికి 60 మంది కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. వీరి నియామక బాధ్యతలను కేంద్రం ప్రైవేటు ఏజెన్సీ సంస్థ కార్వీకి అప్పగించింది. కంప్యూటరీకరణకు అవసరమైన ఇంటర్నెట్ మోడం కోసం ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అన్ని సంఖ్యలో మోడంలు లేవని చెప్పడంతో ఈ ప్రక్రియకు జాప్యం జరుగుతోంది. మోడంలు వచ్చిన వెంటనే కంప్యూటరీకరణ పనులు ప్రారంభించనున్నారు.

పంచాయతీల ఆదాయ, వ్యయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధులు, వాటి వినియోగం, చేపట్టిన కార్యకలాపాలు, పన్నుల రాబడులతో పాటు ప్రజల జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఇలా పంచాయతీ పరిధిలో చేపడుతున్న అన్ని కార్యక్రమాలను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయనున్నారు. ఈ కంప్యూటరీకరణ ద్వారా పంచాయతీలకు విడుదలవుతున్న నిధులు, ఖర్చులు ఆధారంగా భవిష్యత్తులో కేటాయింపులు చేయడానికి అవకాశముంటుందని కేంద్రం భావిస్తోంది.
 
మీ-సేవతో అనుసంధానం

కంప్యూటరీకరణ పూర్తయిన వెంటనే మీ-సేవతో అనుసంధానం చేయనున్నారు. దీంతో ప్రజలు పంచాయతీల ద్వారా పొందాల్సిన అన్ని సేవలను కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ-సేవ కేంద్రాల ద్వారానే పొందే అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయని పక్షంలో భవిష్యత్తులో 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయని కేంద్రం ఆంక్షలు విధించింది. దీంతో మోడంలు వచ్చిన వెంటనే కంప్యూటరీకరణను ప్రారంభించాలని అధికారులు భావి స్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు