పంచాయతీల్లో ప‘వార్’..!

21 Aug, 2013 02:18 IST|Sakshi

పంచాయతీల్లో సర్పంచులకు, కార్యదర్శులకు మధ్య ప‘వార్’ మొదలైంది. నిన్న మొన్నటి వరకు పీఠం కోసం కొట్లాడిన సర్పంచులు ఇప్పుడు అధికారం కోసం లొల్లి పెడుతున్నారు. గత పాలకవర్గాల పదవీకాలం ముగిసిన రెండేళ్ల అనంతరం పంచాయతీ ఎన్నికలు జరగ్గా ఈ నెల 2న సర్పంచులు అధికారిక బాధ్యతలు స్వీకరించారు. అయినా చెక్‌పవర్‌పై అధికారం దక్కకపోవడంతో గ్రామాల్లో పనుల నిర్వహణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా తయారైంది.
 
 ఈ క్రమంలో ప్రథమ పౌరులు తమ అధికారాల కోసం ఒత్తిడి తేవడంతో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు, కార్యదర్శులకు ఉమ్మడి చెక్ పవర్ కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారం వచ్చినప్పటి నుంచి ఎదురుచూస్తున్న చెక్ పవర్ ఇచ్చినట్టే ఇచ్చి మెలిక పెట్టడంపై సర్పంచులు ఆందోళనబాట పడుతున్నారు. తమకే చెక్‌పవర్ అప్పగించాలని జిల్లాలోని పలుచోట్ల వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. నిరసనలతో ‘జాయింట్’ పవర్‌పై తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.    
 - న్యూస్‌లైన్, జిల్లాపరిషత్
 
 జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ :  గతంలో సర్పంచులు, కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్ ఉండేది. కానీ, జనరల్ నిధులకు సంబంధించి సర్పంచులకు మాత్రమే పూర్తి అధికారులు కేటాయించారు. ఈ సారి మాత్రం అన్ని ఖర్చులు, నిధులకు సంబంధించి జాయింట్ పవర్ కేటాయించారు. జిల్లాలోని 1207 గ్రామ పంచాయతీల్లో 1206 గ్రామాలకు పాలకవర్గాలుండగా 550 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. ఇందులో 90 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఉండడంతో.. ఒక్కొక్కరికీ రెండు మూడు గ్రామాల్లో అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో చెక్ పవర్‌ను సర్పంచ్‌లతోపాటు కార్యదర్శులకు కేటాయించడం సమంజసం కాదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 అక్రమాలకు జాయింట్ ‘చెక్’
 నిధుల వినియోగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ఉమ్మడి చెక్ పవర్ కేటాయించినట్లు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో జిల్లాలో 222 మంది సర్పంచు లు ఉపాధిహామీ పనుల్లో రూ.4.22 కోట్లు దుర్వినియోగం చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. వీరిలో 95 మంది నుంచి నిధులు రికవరీ చేసినప్పటికీ మిగతావారి నుంచి రూ.3 కోట్ల వరకు నిధులు రికవరీ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఎవరో చేసిన తప్పులకు తమ అధికారాలకు కత్తెర పెట్టడం సరికాదని సర్పంచులు వాదిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా తమకు కేటాయించిన అధికారాలను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు