‘‘పవనాలు’’ తుందుర్రు మీదుగా వీస్తాయా..?

30 Mar, 2019 10:00 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: భీమవరంలో పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ తుందుర్రు గ్రామం వస్తారా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పటికీ పలుమార్లు హామీలు ఇచ్చినా ఇంతవరకూ ఆ గ్రామం వైపు పవన్‌ కల్యాణ్‌ తొంగి చూడలేదు. గతంలో పదిరోజుల పాటు భీమవరంలోనే మకాం వేసినా తుందుర్రు గ్రామానికి రాలేదు. వస్తానని చెప్పినా తర్వాత మొహం చాటేశారు. తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తుందుర్రు, జొన్నలగరువు, కంసాలబేతపూడి గ్రామస్థులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.

పోలీసు నిర్బంధం సందర్భంగా బాధితులు హైదరాబాద్‌ వెళ్లి కలిశారు. వారి బాధలు విన్న పవన్‌ కల్యాణ్‌ మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తర్వాత కూడా పలుసభల్లో బాధితులను పిలిపించుకుని మాట్లాడటం తప్ప ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనలేదు. కనీసం బాధితుల పరామర్శకు కూడా రాలేదు. భీమవరం మండలం తుందుర్రులో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్కు నిర్మాణం పట్ల స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.  

ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్య కోరల్లో చిక్కుతామని, తమ పొలాలకు, సంప్రదాయ వేట లాంటి ఉపాధి అవకాశాలకు నష్టం కలుగుతుందని పలు గ్రామా ల వారు గత నాలుగేళ్లుగా ఉద్యమాలు చేశారు.  ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభం నాటి నుంచి తుందుర్రు పరిసర ప్రాంతాల్లో పార్కు నిర్మాణం కుదరదంటూ పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ, సీపీఎం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఉద్యమానికి  వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఈ ప్రాంతంలో వద్దని సుమారు 21 గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. నాలుగు వేల టన్నుల చేపలు, రొయ్యలు, పీతలు శుద్ధిచేసే సామర్జ్యంతో ఇది పని చేస్తుంది. దీనికోసం నిత్యం ఫ్యాక్టరీలో అమోనియం నిల్వలను భారీగా ఉంచాల్సి వస్తుంది. రసాయనాలతో కూడిన వ్యర్ధాలను గొంతేరు కాల్వలోకి వదులుతారు. దీనివల్ల నరసాపురం, పాలకొల్లు, భీమవరం, వీరవాసరం, మొగల్తూరు మండలాల్లోని 20 గ్రామాల్లో 30 వేల ఎకరాల ఆయకట్టుకు కాలుష్యం ముంపు ఉంటుందని ఆయా మండలాల వారు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నరసాపురం, భీమవరం, మొగల్తూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఉప్పుటేరును ఆధారం చేసుకుని అనేక మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి.

మత్స్య సంపద  మనుగడకు ప్రమాదం ఉందని  ఆందోళన చెందుతూ వచ్చారు. ఈ ఆందోళనలను అణిచివేయడానికి పోలీసులను అస్త్రంగా వాడుకున్నారు. ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మూడు గ్రామాల్లో 144 సెక్షన్‌ పెట్టారు. ఆందోళనకారులపై హత్యాయత్నం కేసులు పెట్టారు. ఫ్యాక్టరీలో పనులు చేస్తున్న వారిని చంపడానికి ప్రయత్నిస్తున్నారనే అభియోగంపై ఏడుగురిపై 307 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారు.

ఫ్యాక్టరీ వద్ద జరిగిన గొడవలో, పోలీసులను కొట్టారనే అభియోగంపై 37 మందిపై 307 సెక్షన్‌ కింద కేసులు కట్టారు, ఇందులో ఇతరులు అని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. హత్యాయత్నం కేసుల్లో ఏడుగురిని అరెస్టు చేశారు. రెండు నెలలపాటు జైలులో పెట్టారు. ఇప్పటికీ పలువురిపై కేసులు ఉన్నాయి. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సమయంలోనైనా పవన్‌ కల్యాణ్‌ తమ గ్రామానికి వస్తారా అని బాధితులు ఎదురుచూస్తున్నారు. 

మరిన్ని వార్తలు