శిక్షణ పేరుతో ఎన్నికల ప్రచారమా..?

4 Dec, 2018 12:44 IST|Sakshi
మాట్లాడుతున్న అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య

శతమానం భవతి’’ డాక్యుమెంటరీని వెంటనే నిలిపివేయాలి

అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: స్వయం సహాయక సంఘాలకు శిక్షణ పేరుతో ఎన్నికల ప్రచారాలు చేయడం దారుణమని వైఎస్సార్‌ సీపీ అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య ధ్వజమెత్తారు. సోమవారం ఆయన వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుశీలమ్మతో కలిసి విలేకరులతో మాట్లాడారు.  రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో 90 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉండగా... వీరందరికీ శిక్షణ పేరుతో ‘‘శతమానం భవతి’’ అనే డాక్యూమెంటరీని చూపిస్తున్నారన్నారు. ఇందులో చంద్రబాబు ద్వారానే సంఘాలు పూర్తి స్థాయిలో బలోపేతం అయ్యాయని చిత్రీకరించారన్నారు. వీటి ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడం దారుణమన్నారు.

ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకోవాలని మహిళ సంఘాలను కోరుతున్నామన్నారు. చంద్రబాబు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు దిగజారుడు రాజకీయాలకు దిగుతున్నారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ స్వయం సహాయక సంఘాలు, సెర్ప్, మెప్మా, డీఆర్‌డీఏ వంటి సంస్థలు ఇలాంటి చర్యల ద్వారా ఓటర్లను ప్రభావితం చేశారన్నారు. డాక్యుమెంటరీ చివర్లో ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుకునేందుకు అవకాశం వచ్చిందని... దీనికి అందరూ కట్టుబడి ఉండాలని చూపుతునానరన్నారు. ట్రైనింగ్‌ ముసుగులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని తెలిపారు.  గ్రామైక్య సంఘాలకు, ఉద్యోగులకు ప్రభుత్వానికి కొమ్ముకాయొద్దని హితవు పలికారు.   గ్రామైక్య సంఘాలను బలోపేతం చేసిన ఘనత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదని గుర్తుచేశారు. ఆనాడు మహిళ సంఘాలకు 0.25 వడ్డీ రుణాలను అందించి వాటిని బలోపేతం చేశారన్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది అన్న విషయం ప్రతి మహిళా గుర్తుంచుకోవాలన్నారు. 

ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా టీడీపీ చేస్తున్న ప్రచారంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. డాక్యూమెంటరీని నిలుపుదల చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం సుశీలమ్మ మాట్లాడుతూ, తాను ఐదేళ్లు ప్రశాంతి జిల్లా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నానన్నారు. గతంలో జిల్లాలో 55 వేల మహిళా సంఘాలు, 25 వేల గ్రామ సంఘాలు ఉండేవన్నారు. ప్రస్తుతం 35 వేల సంఘాలు మాత్రమే ఉన్నాయన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రాజకీయ రంగు పులిమేందుకు చూస్తోందన్నారు. సంఘాల బలోపేతం తన ద్వారానే సాధ్యమైందని ప్రలోభాలకు గురిచేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డాక్యూమెంటరీ ప్రదర్శనను సంఘాల ప్రతినిధులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి గోగుల పుల్లయ్య పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు