రోగి మృతితో బంధువుల ఆందోళన

5 Sep, 2019 10:02 IST|Sakshi
జీజీహెచ్‌ క్యాజువాల్టీ వద్ద ఆందోళన చేస్తున్న శారద బంధువులు

సాక్షి, కాకినాడ సిటీ: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు వచ్చే రోగులు నరకం చూస్తున్నారని, వచ్చిన రోగిని పట్టించుకునే వైద్యులు లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకొచ్చి చేతులారా చంపుకునే పరిస్థితి వస్తోందని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంకు చెందిన ఓ వ్యక్తిని స్టెచ్చర్‌పై తీసుకొచ్చి డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా మధ్యలో వదిలివేయడంతో చనిపోయిన సంఘటన మరువకముందే తీవ్రమైన గుండె నొప్పితో వచ్చిన ఓ మహిళను ఆసుపత్రిలో వైద్యులు పట్టించుకోకపోవడంతో ఆమె చనిపోయింది. దీంతో ఆసుపత్రి వద్ద బంధువులు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఆత్రేయపురానికి చెందిన మల్లాడి శారద(33)కు ఆరు నెలల క్రితం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్‌ చేశారు. మళ్లీ బుధవారం ఉదయం ఒక్కసారిగా నీరసంగా ఉండి వాంతి చేసుకోవడంతో ఆమెను రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శారదను పరీక్షించి సీరియస్‌గా ఉందని, కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వెంటనే అంబులెన్స్‌లో ఉదయం 11 గంటలకు కాకినాడ జీజీహెచ్‌కి తీసుకొచ్చి క్యాజువాల్టీలో జాయిన్‌ చేశారు. అంబులెన్స్‌లో వచ్చిన వారే శారదకు ఆక్సిజెన్‌ పెట్టి డాక్టర్లకు విషయం చెప్పి వెళ్లారు. అయినా సాయంత్రం 6 గంటల వరకు ఆమెను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. బంధువులు ఎన్ని సార్లు అడిగినా వేరే డాక్టర్లు వచ్చి చూస్తారని చెబుతూ వచ్చారు.

ఆమె ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. దీంతో డాక్టర్లు కంగారుపడి చనిపోయిన తరువాత బంధువులను పిలిచి ఎక్స్‌రే తీయించుకురమ్మన్నారు. తీసుకెళ్లేందుకు స్ట్రెచర్‌ లేకపోవడంతో వైద్యులు మరో గంటసేపు ఆమెను వదిలేశారు. తరువాత చూసేసరికి ఆమె మరణించి ఉండడంతో బంధువులు ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యం వల్లే శారద చనిపోయిందంటూ ఆందోళనకు దిగారు. వన్‌టౌన్‌ పోలీసులు వచ్చి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడినా ఫలితం లేదు. రోగిని చూడకుండా వైద్యులు నిర్లక్ష్యం వహించడంపై డ్యూటీలో ఉన్న డాక్టర్లపై కేసులు పెట్టాలని బాధిత కుటుంబీకులు డిమాండ్‌ చేశారు. సుమారు 3 గంటలకు పైగా ఆందోళన చేశారు. మృతురాలు శారదకు భర్త మల్లాడి రాంబాబు, 13 ఏళ్ల పాప, 10 ఏళ్ల బాబు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు