చినబాబు టూర్‌..ప్రజలు బేజార్‌!

24 Nov, 2018 05:14 IST|Sakshi
ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాలు

గురజాల నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్‌ పర్యటన 

జాతీయ రహదారులపైనే బహిరంగ సభలు

అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై ఐదు గంటలపాటు నిలిచిపోయిన వాహన రాకపోకలు 

ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌లు.. రోగుల పాట్లు 

సాక్షి, గుంటూరు / పిడుగురాళ్ల రూరల్‌: కంచే చేను మేస్తే .. కాపేమి చేయగలడన్న సామెతకు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన నారా లోకేష్‌ పర్యటన నిదర్శనంగా నిలిచింది. అధికార పార్టీ నేతలు, పోలీసుల నిర్లక్ష్యానికి వేలాది మంది ప్రయాణికులు, వాహనదారులు కొన్ని గంటలపాటు రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకయాతన అనుభవించారు. అంబులెన్సులకు సైతం దారి వదలక పోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో శుక్రవారం రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు.

నియోజకవర్గంలోని గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ప్రతి మండల కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించారు. గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల పట్టణాల్లో నడిరోడ్లపై బహిరంగ సభలు  ఏర్పాటు చేయడంతో  వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపి వేయడంతో ప్రయాణికులు  తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా దాచేపల్లి, పిడుగురాళ్ల పట్టణాల్లో బహిరంగ సభలు ముగిసే వరకు సుమారు ఐదు గంటలపాటు అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో సుమారు 10 కిలోమీటర్లకుపైగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్సులకు సైతం దారి ఇవ్వని పరిస్థితి. మాచవరం మండలానికి చెందిన ఓ గర్భిణీ కాన్పు కోసం అంబులెన్సులో నరసరావుపేటకు వెళుతుండగా, పిడుగురాళ్ళకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్‌లో చిక్కుకు పోయింది. దీంతో సుమారు రెండు గంటలపాటు అంబులెన్సులోనే పురిటినొప్పులతో గర్భిణీ అల్లాడిపోయింది. ఆమె పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు దారి కోసం ఎంత ప్రయత్నించినా లోకేష్‌ సభముగిసే వరకు ట్రాఫిక్‌ దిగ్బంధంలోనే ఉండాల్సి వచ్చింది.   

నడిరోడ్డుపై నరకయాతన పడ్డాం: మాచర్ల నుంచి విజయవాడకు కుటుంబంతో కారులో బయల్దేరాం. పిడుగురాళ్ళకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉండగానే ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాం. వెనక్కు వెళ్లలేక, ముందుకు పోలేక సుమారు ఐదు గంటలపాటు కుటుంబంతో నడిరోడ్డుపై నరకయాతన పడ్డాం. – రాజు, వాహనదారుడు, మాచర్ల 

మరిన్ని వార్తలు