పర్సంటేజీల పితలాటకం

9 Nov, 2017 08:33 IST|Sakshi

నగరపాలక సంస్థలో బిల్లుల పంచాయితీ

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అక్రమాలకు.. అవినీతి వ్యవహారాలకు ఆలవాలంగా మారిన నెల్లూరు నగరపాలక సంస్థలో పర్సంటేజీల పితలాటకం తాజాగా రచ్చకెక్కింది. వివిధ అభివృద్ధి పనులను దక్కించుకున్న అధి కార పార్టీకి చెందిన ప్రధాన కాంట్రాక్టర్‌.. ఆ పనులను విభజించి అదే పార్టీకి చెందిన వారికి సబ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించాడు. కమీషన్లు ఎరచూపి పైపై మెరుగులతో పనులు కానిచ్చేసిన సదరు వ్యక్తులు బిల్లుల కోసం నగరపాలక ఇంజినీరింగ్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం పర్సంటేజీ సొమ్ములు ఇవ్వకపోవడం.. అధికారంలో ఉన్నాం కాబట్టి బిల్లులు ఇవ్వాలని కోరటం.. అందుకు ఇంజినీరింగ్‌ విభాగం ససేమిరా అనటంతో ఈ వ్యవహారం కాస్తా రసకందాయంలో పడింది. 

రెండేళ్ల క్రితం పనులవి
డ్రెయిన్లు, గ్రావెల్‌ రోడ్ల నిర్మాణంతో పాటు ఎస్సీ కాలనీలు, శివారు ప్రాం తాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి రూ.42 కోట్ల విలువైన పనులకు 2015 మే నెలలో ప్రతిపాదించారు. వాటిని 8 ప్యాకేజీలుగా విభజించి 2016 అక్టోబర్‌ 13న టెండర్లు పిలిచారు. వీటిలో 7 పనులు మాత్రమే ఖరారు కాగా.. అధికారపార్టీ నేతలు రంగంలోకి దిగారు. టీడీపీ నగర, రూరల్‌ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆ పనులను తమ అనుచరులకే దక్కేలా చక్రం తిప్పి ముందుగానే పంచుకున్నారు. ప్యాకేజీ–1, ప్యాకేజీ–2 టెండర్లను ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి సమీప బంధువు శ్రీహరి దక్కించుకున్నారు. ఆయన వాటిని 30 మంది సబ్‌ కాంట్రాక్టర్లకు పర్సంటేజీ ప్రాతిపదికన అప్పగించారు. వాటిలో దాదాపు 80 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు అంచనా వేశారు. ఇదిలావుంటే.. ఆ పనులకు సంబంధించి ఇంజినీరింగ్‌ విభాగానికి చెల్లించాల్సిన పర్సంటేజీ వ్యవహారం తేలకపోవడంతో బిల్లుల చెల్లింపు వ్యవహారం నెల రోజులుగా పెండింగ్‌లో పడింది. ఈ విషయాన్ని టీడీపీ నేతలు కమిషనర్‌ ఢిల్లీరావు దృష్టికి తీసుకెళ్లడంతో సొమ్ము చెల్లింపునకు ఫైల్‌ వెంటనే పెట్టాలని ఆదేశించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో దీనిపై తర్జన భర్జనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. 

రూ.60 లక్షలు ఇస్తేనే..
సాధారణంగా నగరపాలక ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు ప్రతి పనికి దాని విలువలో 6 శాతం సొమ్మును పర్సం టేజీగా కాంట్రాక్టర్‌ నుంచి వసూలు చేస్తారు. కొందరైతే ముందుగానే ఆ మొత్తం తీసుకుని పనులు మొదలు పెట్టిస్తారు. కొన్ని పనుల్లో రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటే బిల్లు చెల్లింపు సమయంలో వసూలు చేసుకుంటారు. ఇందులో ఇంజినీరింగ్‌ విభాగం ఏఈకి 3 శాతం, డీఈకి 2 శాతం, ఎస్‌ఈకి 1 శాతం వాటాలు ఉం టాయి. తాజాగా పూర్తి చేసిన రూ.10 కోట్ల విలువైన పనులకు సంబంధించి సుమారు రూ.60 లక్షల వరకు అధికారులకు మామూళ్ల రూపంలో ఇవ్వాల్సి ఉంది. ప్రధాన కాంట్రాక్టర్‌తోపాటు సబ్‌ కాంట్రాక్టర్లు ఆ వ్యవహారాన్ని తేల్చకపోవడంతో బిల్లులు చెల్లించడం లేదని సమాచారం. 

మరిన్ని వార్తలు