వచ్చే నెల 4 నుంచి ఆటో, ట్యాక్సీ వాలాలకు రూ.10 వేలు

12 Sep, 2019 15:26 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ‍్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సహాయం టూవీలర్‌ ట్యాక్సీలకు ప్రస్తుతం వర్తించదని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారికి ఏటా రూ. 10 వేల ఆర్ధిక సహాయం అందజేస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది నుంచి అర్హులైన టూవీలర్‌ ట్యాక్సీలకు కూడా ఈ పథకం అమలు చేసే దిశగా ఆలోచిస్తామని మంత్రి తెలిపారు. ఈ పథకం వచ్చే నెల 4 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్న మంత్రి దరఖాస్తులను ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు స్వీకరిస్తామని వెల్లడించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. వాహనాలను ఫైనాన్స్‌లో తీసుకున్నవారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, లబ్దిదారులు కొత్త బ్యాంకు అకౌంట్లు తెరవాలని కోరారు. దాదాపు నాలుగు లక్షల దరఖాస్తులు రావొచ్చనే అంచనాలున్నాయని పేర్కొన్న మంత్రి, ఒకవేళ అంతకు మించి దరఖాస్తులొచ్చినా ఇబ్బంది లేకుండా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు