నత్తే నయం

25 Feb, 2014 00:25 IST|Sakshi
నత్తే నయం

 పోలవరం, న్యూస్‌లైన్:
 పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ నిర్మాణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. స్పిల్‌వే, ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం, పవర్ హౌస్ పనులను ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ చేపట్టింది. ఏడాది గడచినా నిర్మాణాన్ని వేగవంతం చేయలేదు. స్పిల్‌వే, స్పిల్ చానల్, పవర్ హౌస్ నిర్మాణాల కోసం అడ్డుగా ఉన్న కొండలను బ్లాస్టింగ్ ద్వారా తొలగించడం, అవసరమైన చానళ్లను తవ్వడం వంటి ఎర్త్ వర్క్ పనులు చేస్తున్నారు. నిర్దేశించిన ప్రకారం రోజుకు 1.50 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాలి. కానీ.. కేవలం 40 నుంచి 50 వేల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. అధునాతన యంత్రాలను ఉపయోగించాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టు ఏజెన్సీ వాటిని పని ప్రాంతానికి తీసుకురావడం లేదు. స్పిల్‌వే నిర్మాణ ప్రాంతం వద్ద ఇంకా 5 నుంచి 15 మీటర్ల లోతున తవ్వకాలు సాగించాల్సి ఉంది. పనులు ఇలాగే కొనసాగితే గడువు నాటికి పూర్తికావని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
 
 అధునాతన యంత్రాలను తీసుకువచ్చి పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు కాంట్రాక్టు ఏజెన్సీకి నోటీసులు జారీచేసినా ప్రయోజనం కనిపిం చడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 2015 జూన్ నాటికి ఎర్త్ వర్క్ పనులను పూర్తిచేసి గోదావరి నీటిని స్పిల్ చానల్ ద్వారా మళ్లించాల్సి ఉంది. 2015 డిసెంబర్ నాటికి నదిలో కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయూలి. అనంతరం నదిలో ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం పనులు చేపట్టి 2018 నాటికి పూర్తి చేయాలి. అక్కడి పరిస్థితిని చూస్తే గోదావరి నీటిని స్పిల్ చానల్‌కు తరలించే సమయానికి కూడా ఎర్త్ వర్క్ పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ పనులను తరచూ కొన్ని రోజులపాటు నిలి చిపోతున్నారుు. ఇదేమని అధికారులు అడుగుతుంటే.. డీజిల్ కొరత కారణంగా పనులకు అంతరాయం కలుగుతోందని ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇందులో వాస్తవం కాదని అధికారులు పేర్కొంటున్నారు.

>
మరిన్ని వార్తలు