ఖాకీ వనంలో కాబూలీ వాలా

15 Mar, 2015 10:53 IST|Sakshi
ఖాకీ వనంలో కాబూలీ వాలా

గరికిపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఖాకీ దుస్తులు వేసుకున్న నాలుగో తరగతి మునిసిపల్ ఉద్యోగుల్ని చూస్తేనే సామాన్యుడు పోలీసోళ్లేమోనని ఒకింత కంగారుపడుతుంటాడు. పోలీసులు మర్యాద రామన్నల్లా ఉన్నామని ఎంత చెప్పుకున్నా ఖాకీలను చూస్తే భయమనే ముద్ర సమాజంలో చెరిగిపోలేదనేది అందరూ అంగీకరించే వాస్తవం. అటువంటి పోలీసులనే హడలెత్తిస్తున్నాడు ఓ కాబూలీ వాలా. ఇక్కడ విషయమేమిటంటే సదరు వడ్డీ వ్యాపారి కూడా పోలీసేకావడం. వృత్తి పోలీసు ఉద్యోగమైనా వడ్డీ వ్యాపారాన్ని ప్రవృత్తిగా చేసుకుని కోట్లకు పడగలెత్తిన ఈ ప్రబుద్ధుడు ఇప్పుడు పోలీస్ శాఖకు గుండెకాయ వంటి స్పెషల్ బ్రాంచ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నాడట. వడ్డీ వ్యాపారంతోపాటు ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు, మార్ట్‌గేజ్ రిజిస్ట్రేషన్లు చేయడం, భార్య పేరిట భవన నిర్మాణాలు చేపట్టడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లాంటి దందాలో నిత్యం మునిగితేలే ఇతను ఇప్పుడు కీలకమైన విభాగంలో పనిచేస్తూ పోలీసులనే ముప్పుతిప్పలు పెడుతున్నాడని అంటున్నారు.
 
  పోలీసు శాఖ నిబంధనలకు విరుద్ధంగా తన స్వదస్తూరితో రూ.లక్షలకు లక్షలు వడ్డీలకు ఇచ్చినట్టు నిర్భీతిగా ప్రాంసరీ నోట్లు రాయించుకుంటాడు. వడ్డీ కట్టడం ఆలస్యమైనా, చెల్లింపుల్లో రూపాయి తక్కువొచ్చినా.. ఖాళీ స్టాంపు పేపర్లు, నోట్లు, డాక్యుమెంట్లతో పలు ప్రాంతాల్లోని కోర్టులలో భార్య పేరిట దావాలు వేయడం ఇతనికి షరా మామూలే. ఇక డబ్బు కట్టలేని వాళ్ల ఆస్తులను నయానో భయానో స్వాధీనం చేసుకుంటాడు. ఇది బయట వ్యక్తుల వరకే కాదు.. పోలీసు శాఖలో పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులు పడే కానిస్టేబుళ్లు, కుటుంబ అవసరాలతో సతమతమయ్యే పై ఉద్యోగులకు కూడా వడ్డీలకిచ్చి ఆస్తుల పత్రాలు దగ్గర పెట్టుకుని ముప్పుతిప్పలు పెడుతుంటాడు. తనను ఎదిరించిన లేదా గట్టిగా అడిగిన కానిస్టేబుళ్లపైన, ఆపై ఉద్యోగులపైన ఉన్నతాధికారులకు పిటిషన్‌ల మీద పిటిషన్లు పంపిస్తాడు.
 
 ఆరోపణల్లో మచ్చుకు కొన్ని..
 ఏలూరులోని రెండు అపార్ట్‌మెంట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి తన భార్య పేరున రిజిస్టర్ చేయించాడు. వంద చదరపు గజాల స్థలంతోపాటు కార్పొరేషన్‌కు చెందిన రోడ్డును ఆక్రమించి అపార్ట్‌మెంట్ నిర్మాణం చేపట్టాడని కార్పొరేషన్ అధికారులు గగ్గోలు పెట్టినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీ బాధ్యుడిగా పనిచేస్తున్న కాలంలో బినామీల పేరిట లెక్కకు మించిన ప్లాట్లు సొంతం చేసుకున్నాడన్న ఆరోపణలు మూటకట్టుకున్నాడు. ఓ ఇంజినీర్‌కు రూ.6 లక్షల రుణమిచ్చి వడ్డీల మీద వడ్డీలు వేసి రూ.15 లక్షలు కట్టించుకుని ఇంకా డబ్బులు రావాలంటూ భార్య పేరిట ఏలూరు కోర్టులో దావా వేసి డిక్రీ పొందాడు. టి.నర్సాపురం మండలం మక్కినవారిగూడెంకు చెందిన ఓ మహిళకు రూ.2 లక్షలు అప్పిచ్చి రూ. 6లక్షల 30వేలు కట్టించుకుని ఇంకా తన బాకీ తీరలేదని, ఏలూరు సివిల్ జడ్జి కోర్టులో డిక్రీ పొందాడు.
 
 విచారణల మీద విచారణలు
 ఇప్పటికే సదరు ఉద్యోగి అరాచకాల మీద శాఖాపరమైన విచారణలే కాదు ఏసీబీ, విజిలెన్స్, విచారణ, లోకాయుక్తా విచారణలు కొనసాగుతున్నాయి. పదిహేనేళ్ల కిందట తాడేపల్లిగూడెంలో కానిస్టేబుల్‌గా పనిచేసే రోజులలో హోంగార్డుల జీతాలు కాజేసి సస్పెండైన చరిత్ర ఉంది. విజయవాడ రైల్వే పోలీస్ విభాగంలో పనిచేసిన కాలంలో చోరీ సొత్తు మాయం చేసి దొంగలను వదిలేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. గతంలో నిర్భయ కేసునూ ఎదుర్కొన్నాడు. ఇంతటి చరిత్ర ఉన్న అతన్ని కీలకమైన స్పెషల్ బ్రాంచ్‌కి ఎలా తీసుకువచ్చారు.. ఎవరి ప్రోద్బలంతో ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నాడన్నది ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. రాజకీయాలకు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాయితీగా పనిచేస్తూ జిల్లాలో పోలీసు యంత్రాంగాన్ని తమదైన శైలిలో పరుగులు పెట్టిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు తమ పంచలోనే ఉన్న సదరు కాబూలీ వాలాపై ఓ కన్నేయాలన్నదే ఖాకీవనం నుంచి వచ్చిన విన్నపం.
 
 

మరిన్ని వార్తలు